TDPP Meeting: రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు కోసం రాజీలేని పోరాటం.. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయం
విశాఖ స్టీల్ ఫ్లాంట్ పోలవరం, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాల నిధులు అంశాలను పార్లమెంట్ సాక్షిగా ఉద్యమించాలని తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది.
TDP Parliamentary Party meeting: విశాఖ స్టీల్ ఫ్లాంట్ పోలవరం, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాల నిధులు అంశాలను పార్లమెంట్ సాక్షిగా ఉద్యమించాలని తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంత్ర హాజరైనారు. సుమారు 18 అంశాలపై పార్లమెంటరీ పార్టీ భేటీలో చర్చించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, జల వివాదంపై ప్రధాన చర్చ జరిగింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు హాజనై ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎంపీలు కనకమేడల రవీంద్ర, రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం అనేక పథకాలకు నిధులు ఇచ్చింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ఎంపీలు.. వ్యాక్సినేషన్‌ను దుర్వినియోగం చేసిందని తప్పుబట్టారు.
తెలంగాణ తో జగన్ అనుసరించిన మెతక వైఖరి వలన రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. సీఎం జగన్ సర్కార్ పోరాటం చేయకుండా..లేఖలతో సరిపెట్టారు. పార్లమెంట్‌లో అన్ని విషయాలు లేవనెత్తుతామని ఎంపీ రవీంద్ర తెలిపారు.
పోలవరం, ప్రత్యేక హోదా,వెనుకబడిన జిల్లాల నిధులు అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పోరాటం చేస్తామన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా టీడీపీ అడ్డుకుందని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో సీఎం జగన్ తూతూ మంత్రంగా వ్యవహారిస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము రాజీనామా లకు సిద్ధంగా ఉన్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు కోసం టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.