Vizianagaram: ‘మూడవ బిడ్డ ఆడపిల్ల అయితే యాభై వేలు.. మగ పిల్లోడు అయితే ఆవు, దూడ’
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన స్ఫూర్తితో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఎవరికైనా మూడో సారి ఆడ బిడ్డ జన్మిస్తే వెంటనే అమ్మాయి పేరిట రూ.50వేలు డిపాజిట్ చేయునున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రకటించారు. అదేవిధంగా మూడో సారి మగ బిడ్డ పుడితే ఆవు, దూడ బహుమతిగా అందజేస్తానని అన్నారు.

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జనాభా పెరుగుదల కోసం అందరూ ప్రయత్నించాలని, ఎక్కువమంది పిల్లల్ని కనాలని పిలుపునిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ఎంపి కలిశెట్టి ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు అడుగులు వేశారు. మూడవ బిడ్డకు జన్మనిచ్చిన మహిళలకు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు తెలిపారు. తన విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఎవరైనా మూడో బిడ్డకు జన్మనిస్తే ప్రోత్సాహకాలు కల్పిస్తానని ప్రకటించారు. మూడో బిడ్డ.. ఆడపిల్ల అయితే 50వేలు ఇస్తానని, మగ బిడ్డ పుడితే ఆవు, దూడ ఇస్తానని ప్రకటించారు.
తనకు ప్రతినెల 3 లక్షల వరకు జీతభత్యాలు వస్తాయని ఆ మొత్తం నగదు ఈ తరహ ప్రోత్సాకానికే ఇస్తానని తెలియజేశారు. ఇది కేవలం తాను ఎంపీ పదవి ఉన్నంత వరకే కాదని శాశ్వతంగా కొనసాగిస్తానని అన్నారు. ఎంపీ కలిశెట్టి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు. తన తల్లి నేర్పిన సంస్కారంతో ప్రజలకు సేవ చేస్తున్నానని, తనకు ఆరుగురు అక్కచెల్లెళ్లు, ఒక కుమార్తె ఉన్నారని తెలిపారు. తన కుటుంబంలో ఇంత మంది మహిళలు ఉండటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, వారు తన పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్లే మహిళల కోసం ప్రత్యేకంగా ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.
తొలిసారి ఎంపీగా ఎన్నికైన కలిశెట్టి అప్పలనాయుడు అనేక వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. ఢిల్లీలో తన క్వార్టర్స్ నుంచి పార్లమెంట్ వరకు సైకిల్‌పై ప్రయాణం చేసి అందరి దృష్టి ఆకర్షించారు. డిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యము తగ్గించాలంటే అందరూ సైకిళ్లు లేదా కాలుష్యం విడుదల కాని విధానాలను వినియోగించాలని కోరారు. అంతే కాకుండా తెలుగు భాష పరిరక్షణ కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల ప్రయాగరాజ్‌లో జరిగిన మహ కుంభమేళాలో తెలుగు వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ను కోరి తెలుగువారి సౌకర్యాల కోసం కృషి చేశారు. ఇప్పటివరకు డిల్లీలో జరిగిన పార్లమెంట్ సమావేశాలకు ఒక్క రోజు కూడా గైర్హాజరు కాకుండా క్రమం తప్పకుండా అన్ని సమావేశాలకు హాజరై పూర్తిస్థాయి హాజరు కనబరిచిన ఎంపీగా రికార్డ్ సృష్టించారు. ఇలా అనేక వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..