Rohit – Virat: ఆకట్టుకుంటున్న రోకో శాండ్ ఆర్ట్.. కుప్పం కళాకారుడి అద్భుత సృష్టి
భారత్ ఆదివారం దుమ్మురేపింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్ ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. కాగా మ్యాచ్ తర్వాత సంబరాలు హైలైట్‌గా నిలిచాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ట్రోఫీ కైవసం చేసుకున్న సంతోషంతో ఇద్దరు ప్లేయర్స్ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకొని సంబరాల్లో మునిగిపోయింది యావత్ భారతదేశం. దుబాయ్‌లో న్యూజిల్యాండ్‌తో తలపడ్డ భారత జట్టు అద్భుత ఆటతీరుతో ట్రోఫీ గెలుచుకున్నారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన రోహిత్ శర్మ విజయానికి బాటలు వేశాడు. ఒకానొక సమయంలో భారత జట్టు వరుసగా మూడు వికెట్లు కోల్పోయి తడబడింది. కానీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ వికెట్‌ను కాపాడి సూపర్ భాగస్వామ్యం నెలకొల్పారు. అయ్యర్ 48 పరుగులు చేయగా, అక్షర్ కూడా 29 పరుగులు చేశాడు. చివర్లో రాహుల్ 33 బంతుల్లో 34 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించి భారత్‌ను గెలిపించి కప్పును అందించాడు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో రోహిత్ సేన భారత్ కు అందించిన విజయం దేశం నలుమూలల తాకింది. క్రీడాభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సామాన్యుడి దాకా భారత జట్టు సాధించిన అద్భుత విజయాన్ని ఆస్వాదించింది. అసాధారణ మ్యాచ్ లో ఛాంపియన్ గా నిలిచిన టీమిండియాకు మరో కప్పు సొంతమైన వేళ చిత్తూరు జిల్లాలో ఒక కళాకారుడు అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించాడు. కుప్పంకు చెందిన పురుషోత్తం టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీల స్నేహ బంధాన్ని సాండ్ ఆర్ట్ రూపంలో ఆవిష్కరించాడు.
ఫైనల్లో న్యూజిలాండ్ పై ఆల్ రౌండ్ షో చేసిన టీమిండియా ఆటగాళ్లు మైదానంలో భలేగా సంబరాలు జరుపుకోగా అదే జోష్ అంతటా కనిపించింది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ కోహ్లీలు రోకోగా అదిరిపోయే ఆట తీరును ప్రదర్శించి గెలిచాక స్టంప్స్‌తో సరదాగా కోలాటం ఆడారు. ఇద్దరి స్నేహబంధంలో దాగి ఉన్న ఆనందం భారత క్రీడాభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్నేహం ఎంత గొప్పదో అని చాటి చెప్పే ప్రయత్నం చేసిన ఆర్టిస్ట్ పురుషోత్తం అభిమానులను ఆకట్టుకునే రోకో ఫ్రెండ్షిప్ చిత్రాన్ని చిత్రీకరించాడు. ఇద్దరు స్టార్ ఆటగాళ్ల చిత్రాలను సాండ్ ఆర్ట్ గా ఆవిష్కరించి రోహిత్, విరాట్ అభిమానులకు అంకితం చేశాడు. ఈ రోకో చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.