Varahi Yatra 4th Phase: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై ఉత్కంఠ.. టీడీపీ నేతలతో కలిసి కీలక నియోజకవర్గాల్లో టూర్..!
Varahi Yatra: మూడు విడతల యాత్రలో కూడా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. ఒక వైపు సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు చేస్తూనే స్థానిక ఎమ్మెల్యేల అవినీతి టార్గెట్‌గా పవన్ యాత్ర కొనసాగింది. స్థానిక సమస్యలపై ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆయా నియోజకవర్గాల పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్ఠీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై..

ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 26: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి వారాహి యాత్రకు సిద్దమవుతున్నారు. అక్టోబర్ 1 నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర సాగనుంది. ఇప్పటికే మూడు విడతల యాత్ర పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్.. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. సుమారు 40 రోజుల విరామం తర్వాత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. మొదటి విడత వారాహి యాత్రను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముగించగా.. రెండో విడతలో ఏలూరు నుంచి యాత్ర ప్రారంభించి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముగించారు. అలాగే మూడో విడత వారాహి యాత్ర విశాఖ పట్నంలో కొనసాగింది.
అయితే మూడు విడతల యాత్రలో కూడా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. ఒక వైపు సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు చేస్తూనే స్థానిక ఎమ్మెల్యేల అవినీతి టార్గెట్‌గా పవన్ యాత్ర కొనసాగింది. స్థానిక సమస్యలపై ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆయా నియోజకవర్గాల పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్ఠీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై దిశానిర్ధేశం చేసారు. ఇక మూడో విడతలో విశాఖపట్నంలో రెండు మాత్రమే బహిరంగ సభలు నిర్వహించారు. కానీ విశాఖపట్నంలో ఉన్న ప్రధాన సమస్యలపై క్షేత్రస్థాయి పర్యటనలు చేసారు పవన్. రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించి ప్రభుత్వంపై విమర్శలు చేసారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభాని కంటే ముందున్న పరిస్థితికి ఆ తర్వాత పార్టీ పరిస్థితికి చాలా మార్పు వచ్చిందని జనసేన నేతలు చెబుతున్నారు. కానీ మొదటి 3 విడతల యాత్రకు నాలుగో విడత యాత్రకు ఎంతో మార్పు కనబడనుంది. ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలతో పవన్ యాత్రపై ఉత్కంఠ నెలకొంది.
టీడీపీతో పొత్తు ప్రకటన.. కీలక నియోజకవర్గాల్లో కలిసి టూర్
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఈ సారి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మొదటి 3 విడతల యాత్రలో కేవలం జనసేన పార్టీ బలోపేతం, ఓటింగ్ శాతం పెంచుకోవడం పైనే పవన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కానీ చంద్రబాబు అరెస్ట్, జైలుకి వెళ్లిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. చంద్రబాబుతో ములాఖత్ కోసం వెళ్లిన పవన్ కళ్యాణ్ అనూహ్యంగా పొత్తులపై స్పష్టత ఇచ్చేసారు. తెలుగుదేశం పార్టీతో కలిసే ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించారు. దీంతో జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా పవన్ నిర్ణయం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే పొత్తుల ప్రకటన తర్వాత యాత్ర స్వరూపం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పవన్ నాల్గో విడత టూర్ సాగనుంది. మచిలీపట్నం కేంద్రంగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పర్యటనలకు పవన్ వెళ్లనున్నట్లు తెలిసింది. కృష్ణా జిల్లాలో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే అవనిగడ్డ, మచిలీపట్నం, పెడనతో పాటు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గంలో పవన్ పర్యటన సాగనుంది. నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీలో కీలక నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని, పెడన నుంచి మంత్రి జోగి రమేష్, కైకలూరు నుంచి దూలం నాగేశ్వరరావు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
అయితే సింహాద్రి రమేష్ బాబు, దూలం నాగేశ్వరరావులు పవన్‌పై విమర్శలు చేసింది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే. కానీ పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే ఎమ్మెల్యే పేర్ని నాని, మంత్రి జోగి రమేష్ ఒంటి కాలిపై లేస్తారు. సీఎం జగన్‌ను పవన్ ఏదైనా విమర్శిస్తే వెంటనే రంగంలోకి దిగిపోతారు పేర్ని నాని. అంతేకాదు ఇటీవల ఇద్దరి మధ్య చెప్పుల దొంగతనం గోల కూడా సాగింది. దీంతో మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన చాలా ఉత్కంఠగా మారింది. మొత్తం ఈ నాలుగు నియోజకవర్గాల్లో రెండు స్థానాల నుంచి జనసేన బరిలో ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. మచిలీపట్నం, అవనిగడ్డ స్థానాల్లో జనసేన పోటీలో ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. మరోవైపు పొత్తుల ప్రకటన తర్వాత జరుగుతున్న యాత్రలో టీడీపీ నాయకుల పాత్ర ఎంటనే చర్చ కూడా మొదలైంది.
టీడీపీ నేతలతో కలిసి సాగనున్న వారాహి యాత్ర
తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి వెళ్తుందన్న పవన్ ప్రకటన తర్వాత క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. పవన్ ప్రకటన తర్వాత చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న దీక్షలు, ఆందోళనల్లో జనసేన నాయకులు కూడా పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల రెండు పార్టీల కీలక నేతలు సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే వారాహి యాత్రలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనేలా రెండు పార్టీల నాయకులు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్‌తో పాటు వారాహిపై ఆయా నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఇంచార్జిలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్ వారాహి యాత్ర ఈ సారి రెండు పార్టీల ప్రచార యాత్రగా మారుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




