AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్

జూనియర్ ఎన్టీఆర్ సినిమాను లక్ష్యంగా చేసుకుని అనంతపురం ఎమ్మెల్యే డగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసినట్టుగా వైరల్ అయిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయి. ఈ వ్యవహారం చివరికి సీఎం చంద్రబాబు దృష్టికీ చేరడం.. ఆయన వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Andhra: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
CM Chandrababu Jr NTR
Eswar Chennupalli
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Aug 18, 2025 | 10:07 AM

Share

NTR నటించిన వార్‌-2 సినిమా టీడీపీ వర్గీయులెవరూ చూడొద్దంటూ.. అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ బెదిరించారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. TDPకి దూరంగా ఉంటున్న NTR సినిమాని ఎందుకు చూడాలని దగ్గుపాటి ప్రసాద్‌ ప్రశ్నిస్తున్నట్లు ఉన్న ఓ ఆడియో వైరల్‌ కాగా.. అనంతపురంలోని ఆయన క్యాంప్‌ ఆఫీస్‌ ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ధర్నాకు దిగారు. సోషల్ మీడియాలో లీకైన ఆడియోలో ఆయన గళం, మాటలు పోలి ఉండడంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. “లోకేశ్ పేరు వస్తే సినిమా ప్రదర్శించవద్దు” అన్న హెచ్చరిక జూనియర్ అభిమానుల్లో ఆగ్రహానికి దారితీసింది. ఎన్టీఆర్‌కు దగ్గుపాటి ప్రసాద్‌ క్షమాపణ చెప్పాలని అభిమానులు. డిమాండ్ చేస్తున్నారు. ఇక.. అనంతపురంలో మొదలైన కాక.. ఏపీలోని పలు జిల్లాలకు పాకింది. అన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు.

కాగా.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కూడా కలకలం రేపాయి.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. నేతల నిర్లక్ష్య వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతున్నాయని సీఎం ఈ వ్యవహారంపై కామెంట్ చేశారు. జరిగిన పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అహంకారాలు, వర్గపోరాటాలు పార్టీకి మాత్రమే కాదు ప్రజలకు కూడా నష్టం చేస్తాయని స్పష్టం చేశారు.

ఆడియో నాది కాదన్న ఎమ్మెల్యే ప్రసాద్

జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ స్పష్టం చేశారు. అనంతపురంలో గత కొద్ది రోజులుగా సాగుతున్న ఆధిపత్య రాజకీయ పోరు లో భాగంగా నన్ను బద్నాం చేసేందుకే ఆడియోని సృష్టించారని ఎమ్మెల్యే ఆరోపించారు. తాను నందమూరి నారా కుటుంబాల అభిమానినని ఎప్పటికీ అలాంటి విమర్శలు చేయబోనన్నారు.. దానిపై విచారణ చేయాలని జిల్లా ఎస్పీని కూడా కోరామని, వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు ఎమ్మెల్యే.

ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలపై కూడా అసహనం

అనంతపురం ఘటనతో పాటు ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై వచ్చిన వార్తల పట్ల కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. “పార్టీ కంటే వ్యక్తిగతం గొప్పదని భావించే వారికి టీడీపీలో స్థానం లేదు” అని కఠినంగా హెచ్చరించారు.

పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు సూచించారు. నేతలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత నిర్ణయాలు పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉంటే ఇక సహించబోమని ఆయన స్పష్టం చేశారు. చిన్న విమర్శకే ఆస్కారం ఇవ్వకుండా బాధ్యతతో ప్రవర్తించాలని ఎమ్మెల్యేలందరికి సూచించారు.

సూపర్ సిక్స్ సమీక్ష – స్పష్టమైన సందేశం

అమరావతిలో జరిగిన సమావేశంలో చంద్రబాబు పార్టీ వర్గాలతో సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజల స్పందనపై సమీక్ష నిర్వహించారు.

అన్నదాత సుఖీభవ పథకంపై చేపట్టిన ర్యాలీల సమీక్ష

ఉచిత బస్సు పథకంపై అన్ని ప్రాంతాల్లో అద్భుత స్పందన వస్తోందని పార్టీ విభాగాలు వివరించాయి.

సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావడంతో వైసీపీ అంతర్మథనంలో పడిందని, అందుకే తప్పుడు ప్రచారాలకు దిగుతోందని వర్గాలు తెలిపారు.

ఉచిత బస్సుపై గందరగోళం సృష్టించేందుకు వైసీపీ, అనుబంధ మీడియా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు నేతలకు సూచించారు.

ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆదేశాలు

పథకాల అమల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు విధిగా భాగస్వాములు కావాలని చంద్రబాబు స్పష్టం చేశారు. “ప్రజలతో మమేకం అవ్వడం ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది” అని వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో అనంతపురం ఘటనతో సహా పలు వివాదాలపై చర్చించి, గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలు ఇకపై ఉపేక్షించమని హెచ్చరించారు.

నివేదిక కోరిన చంద్రబాబు

అనంతపురం, ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఘటనలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి నివేదిక కోరినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు వ్యక్తిగత వ్యాఖ్యలు, చర్యలు పార్టీకి చెడ్డపేరు తెస్తే ఇకపై మన్నించేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..