Rain Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాలకు అత్యంత భారీ వర్షాలు
తెలుగు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఇవాళ, రేపు అటు తెలంగాణ, ఇటు ఏపీలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ వివరాలు ఏంటో ఈ వార్తలో చూసేద్దాం మరి. ఓ సారి లుక్కేయండి.

పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది ఇవాళ అనగా సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు అనగా మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందంది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూగో, పగో, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అటు వర్షాల నేపథ్యంలో రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావం, నష్ట నివారణా చర్యలను ఎప్పటికప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖా మంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారు.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అటు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి(ఆరెంజ్ అలెర్ట్) జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఆదిలాబాద్, హనుమకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరం భీమ్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ఇచ్చింది.
