Chandrababu Naidu: ఎన్టీఆర్ నిర్మించిన వర్సిటీకి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటారు.. సీఎం జగన్ కు చంద్రబాబు సూటి ప్రశ్న
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మారుస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ సర్కార్ తీరుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం..
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మారుస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ సర్కార్ తీరుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీకి, వైఎస్సార్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని చూస్తుంటే జగన్ ప్రభుత్వ దివాళా తనానికి నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి పనులతో సీఎం జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని ఆక్షేపించారు. ఎన్టీఆర్ నిర్మించిన వర్సిటీకి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మారిస్తే మార్పు రాదని, కొత్తగా నిర్మించి వాటికి నచ్చిన పేర్లు పెట్టుకోవాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
వైద్య విద్య కోసం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తీవ్రంగా కృషి చేశారు. ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలనే సంకల్పంతో 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అలాంటి చరిత్ర కలిగిన వర్సిటీ పేరు మార్చడం నిజంగా హేయమైన చర్య. ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు సంబంధం ఏంటి ?. దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే అభివృద్ధి జరిగినట్లు కాదు. ప్రజలు వీటిని గమనిస్తున్నారు. మీకు పేరు రాదు సరికదా మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్య. తన చర్యలతో జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారు.
– నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
కాగా.. విజయవాడలోని ఎన్డీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదించింది. వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ సెప్టెంబర్ 21వ తేదీ బుధవారం శాసనసభలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈబిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో టీడీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ గౌరవని, తాను ఎప్పుడూ ఎన్టీఆర్‌ను ఒక్కమాట కూడా అనలేదని సీఎం జగన్ వెల్లడించారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం