ఢిల్లీ వీధుల్లో రంకెలు వేయనున్న లేపాక్షి బసవన్న.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కనువిందు చేయనున్న శకటం

లేపాక్షి బసవన్న ఢిల్లీ వీధుల్లో రంకెలు వేయనున్నాడు. అదేంటి లేపాక్షి బసవన్న ఢిల్లీకి వెళ్లడం ఏంటి అనుకుంటున్నారా? అవును ఈ సారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో

  • Ram Naramaneni
  • Publish Date - 6:58 pm, Mon, 25 January 21
ఢిల్లీ వీధుల్లో రంకెలు వేయనున్న లేపాక్షి బసవన్న.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కనువిందు చేయనున్న శకటం

లేపాక్షి బసవన్న ఢిల్లీ వీధుల్లో రంకెలు వేయనున్నాడు. అదేంటి లేపాక్షి బసవన్న ఢిల్లీకి వెళ్లడం ఏంటి అనుకుంటున్నారా? అవును ఈ సారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగే వేడుకల్లో ఏపీ ప్రభుత్వం తరపున లేపాక్షి ఆలయ వైభవం అందర్నీ కనువిందు చేయనుంది. ఇందుకోసం అద్భుతమైన సెట్‌ వేశారు. ఇప్పటికే శకటం ఢిల్లీకి చేరుకుంది.

ఢిల్లీలో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో లేపాక్షి బసవన్న ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. ఏపీ ప్రభుత్వం తరుపున తన రాజసాన్ని, రౌద్రాన్ని చూపించబోతున్నాడు. వాస్తవంగా లేపాక్షి ఆలయానికి ప్రపంచ పటంలో ఎప్పుడో గుర్తింపు లభించింది. ఎన్నో విశేషాలకు, వింతలకు, ఆధ్యాత్మీకతకు నిలయమైన లేపాక్షి అంతగా ప్రాచుర్యం పొందలేదు. అప్పుడప్పుడు జరిగే లేపాక్షి ఉత్సవాలతో చాలా మంది నేటి తరం వారికి తెలిసేలా చేస్తున్నారు.

విజయనగరరాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయ విశిష్టతను ఢిల్లీలో చాటనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి నంది విగ్రహం.. శకటానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆలయ అద్భుత నిర్మాణశైలి, ముఖమంటపం, అర్ధాంతరంగా ఆగిన కల్యాణ మంటప నమూనాను ప్రదర్శించనున్నారు. రాతితో చెక్కిన పెద్ద వినాయకుడు, ఏడు శిరస్సుల నాగేంద్రుని ప్రతిమ శకటంలో ఆకర్షణగా నిలువనుంది. దక్ష యజ్ఞంలో వీరభద్రుడి ఉగ్రరూపాన్ని చాటేలా శకటం ముందుకు సాగే సమయంలో వీరశైవుల సంప్రదాయ కళారూపం వీరగాసే నృత్యాన్ని కళాకారులు ప్రదర్శించనున్నారు.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకుని రెండు మూడు రోజుల ముందే ఈ శకటం హస్తినకు చేరుకుంది. ఇందుకు సంబంధించి పర్యాటకశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లేపాక్షి బసవన్న రాజసం ఖచ్చితంగా అన్ని శకటాల్ని మించి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read:

Pangolin smuggling: మంచిర్యాల జిల్లాలో అలుగును పట్టారు.. కోటిన్నరకు బేరం పెట్టారు.. చివరకు

శ్రీకాకుళం జిల్లాలో యువకుడికి చిక్కిన వింత చేప.. దాని పేరు కూడా మత్సకారులకు తెలియదట..!