Vizianagaram: అయ్యో! శ్యామల ఎంత పని చేశావ్.. ఒంటరి మహిళలే అతని టార్గెటా..?
అందరితో సరదాసరదాగా గడిపే ఆ మహిళ మృతి అందరినీ కలచివేస్తుంది. ఆ మహిళ మృతికి కారణాలేంటో తెలియక అటు గ్రామస్తులు, ఇటు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ మహిళ మరణానికి కారణాలేంటి? ఎవరైనా హత్య చేశారా?లేక ఇంకేమైనా కారణాలున్నాయా? ...

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం గ్రామానికి చెందిన తుమరాడ శ్యామల (42) అనుమానాస్పద మృతి జిల్లాలో కలకలం రేపుతోంది. శ్యామల గత ఇరవై ఏళ్లుగా ఒంటరిగా నివాసం ఉంటుంది. శ్యామలకు ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లైన రెండేళ్లకే భర్తతో ఏర్పడ్డ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. అప్పటి నుండి శ్యామల తారాపురంలో ఒంటరిగానే నివసిస్తూ జీవనం సాగిస్తోంది.
అయితే ప్రతి రోజూ ఉదయాన్నే లేచి తన పనుల్లో తాను ఉండే శ్యామల.. ఇటీవల ఓ రోజు ఎంత సమయం అయినా తలుపులు తీయలేదు. దీంతో స్థానికులకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా శ్యామల విగతజీవిగా పడి ఉంది. విషయం తెలుసుకున్న శ్యామల సోదరుడు తుమరాడ సింహాచలం తన అక్క మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, గ్రామానికి చెందిన భాస్కరరావు పాత్ర ఉందని పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. గ్రామానికి చెందిన భాస్కరరావు వివాదాస్పదంగా వ్యవహరిస్తుంటారని స్థానికులు చెప్తున్నారు. భాస్కర్ రావు గతంలో కూడా ఒంటరి మహిళలతో కొన్నాళ్లు సహజ జీవనం చేసి వారి ఆస్తులు కాజేస్తూ ఉంటాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గత కొన్నాళ్ల నుండి శ్యామలతో వివాహేత సంబంధం కొనసాగిస్తున్నాడు. నిత్యం శ్యామల వద్దకు వచ్చి వెళ్తుంటాడు. ఈ వ్యవహారం గ్రామస్తులకు కూడా తెలుసు. ఈ క్రమంలోనే 20వ తేదీ రాత్రి శ్యామల వద్దకు వచ్చిన భాస్కరరావు శ్యామలతో గొడవపడ్డాడు. వారిద్దరి మధ్య ఘర్షణ అనంతరం భాస్కరరావు అక్కడినుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రోజు ఉదయం శ్యామల విగతజీవిగా పడి ఉండటం స్థానికులు గుర్తించారు.
అయితే శ్యామల భాస్కరరావు తో గొడవ పడి మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందా? లేక భాస్కరరావు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్ వేశాడా? ఇంకా వేరే మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రామభద్రపురం పోలీసులు మాత్రం కేసును లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. గత వారం రోజుల క్రితం ఇదే మండలంలో జరిగిన మరో అనుమానస్పద కేసును కూడా నీరు గార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
