Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

supreme court: రుషికొండ టూరిజం ప్రాజెక్టు.. స్టే ఉత్తర్వులపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు..

రుషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్జీటీ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు రాసిన లేఖ ఆధారంగా రుషికొండ టూరిజం ప్రాజెక్టు నిర్మాణ పనులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధిచంగా, దాన్ని సవాల్ చేస్తూ

supreme court: రుషికొండ టూరిజం ప్రాజెక్టు.. స్టే ఉత్తర్వులపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు..
Rushikonda
Follow us
Jyothi Gadda

|

Updated on: May 31, 2022 | 2:53 PM

రుషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్జీటీ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు రాసిన లేఖ ఆధారంగా రుషికొండ టూరిజం ప్రాజెక్టు నిర్మాణ పనులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధిచంగా, దాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఓ ప్రజాప్రతినిధి రాసిన లేఖను ఎన్జీటీ పిటిషన్‌గా స్వీకరించి ఉత్తర్వులు జారీ చేయడాన్ని జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ హిమకొహ్లి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుబట్టింది. న్యాయస్థానాలకు చేరుకోలేనివారు, కోర్టుల్లో పిటిషన్లు వేయలేనివారు రాసే లేఖలను పిటిషన్లుగా స్వీకరించవచ్చని, ఓ ప్రజాప్రతినిధి రాసిన లేఖను పిటిషన్‌గా స్వీకరించడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ కేసులో ప్రతివాదులు సమయం కోరడంతో కేసు విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఇక ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుషికొండ టూరిజం ప్రాజెక్టు సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఎంపీ రఘురామకృష్ణ రాజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండానే ఎన్జీటీ స్టే ఉత్తర్వులిచ్చింది. అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రతివాదిగా చేరి తమ వాదనలు వినిపించినప్పటికీ, స్టే తొలగించలేదు. దీంతో ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీ ఏకపక్షంగా స్టే విధించిందని, అప్పటికే అక్కడ నిర్మాణ పనులు సగం పూర్తయ్యాయని సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. మంగళవారం ఈ కేసు విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి వాదనలు వినిపించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఎన్ఓసీ, కోస్టల్ జోన్ అథారిటీ, అటవీ శాఖ నుంచి అనుమతులు ఉన్నాయని సింఘ్వి తెలిపారు. అలాగే సీఆర్‌జెడ్ అనుమతులు సరైనవో కావో తేల్చేందుకు మరో కమిటీని సైతం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రాజెక్టులో 300 మందికి ఉపాధి లభించిందని, రూ. 180 కోట్ల పెట్టుబడులు పెట్టామని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న రఘురామకృష్ణ రాజు తదితరులు సమయం కోరడంతో విచారణను బుధవారానికి వాయిదా వేసింది.