AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP – Telangana: ఈత… కడుపుకోత…! గత 20 రోజుల్లో 17 మంది మృతి

వేసవి సెలవులు కావడం... ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండటంతో పిల్లలు ఇంట్లో చెప్పకుండా వెళ్లి మునిగిపోతున్నారు. ఈత సరదా వారి బంగారు భవిష్యత్‌ను తుంచేస్తోంది. కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు అర్ధంతరంగా నీళ్లపాలైపోవడంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. కొన్నిరోజులుగా జరుగుతున్న వరుస ఘటనలు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి.

AP - Telangana: ఈత... కడుపుకోత...! గత 20 రోజుల్లో 17 మంది మృతి
Swimming Tragedies
Ram Naramaneni
|

Updated on: Jun 08, 2025 | 10:01 PM

Share

ఈత సరదా చిన్నారుల ఉసురు తీస్తోంది. అడుతూపాడుతూ వేసవిలో సరదాగా గడిపేందుకు చిన్నారులు ఉత్సాహంగా చెరువులు, కుంటల్లో దిగి మృత్యువాత పడుతున్నారు. బంగారు భవిష్యత్‌ నీటిపాలు చేస్తున్న ఈ ఘటనలు వారి కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. గత 20రోజుల్లో జరిగిన మూడు ప్రమాదాలు కలచివేస్తున్నారు. వేర్వేరు ఘటనల్లో 17 మంది చనిపోవడంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

నిన్నటికి నిన్న గోదావరిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు జల సమాధి అయ్యారు. ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు నిర్విరామంగా శ్రమించి వారి మృతదేహాలను వెలికి తీశారు. సరదా కోసం వెళ్లి విగతజీవులుగా మారిన వారిని చూసి, మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెళ్లి ఇంట్లో ఊహించని విషాదం జరగడంతో… రెండు గ్రామాల్లో రోదనలు మిన్నంటాయి.

ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. అంబటిపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో రెండు రోజుల క్రితం పెళ్లి వేడుక జరిగింది. ఆ వేడుక కోసం వచ్చిన బంధువుల పిల్లలు మేడిగడ్డ బ్యారేజ్‌ చూడ్డానికి వెళ్లారు. సరదాగా కాసేపు ఈత కొడదామంటూ అందులోకి దిగారు… ఇక గోదావరి లోతు గుర్తించని చిన్నారులు అందులో మునిగిపోయారు. అలా ఒకరి వెంట మరొకరు మొత్తం ఆరుగురు గల్లంతయ్యారు. ఇక కొన్ని గంటలపాటు శ్రమించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వాళ్ల మృతదేహాలను వెలికితీసింది.

ఏపీలోని అల్లూరి జిల్లాలోనూ ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. అరకులోయ ఏజెన్సీలోని చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతిచెందారు. సరదాగా స్నేహితులతో గడిపేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. దీంతో కుటుంబ సభ్యుల రోధన వర్ణణాతీతం.

మొన్నామధ్య కోనసీమ జిల్లా ముమ్ముడివరంలోనూ పెను విషాదం జరిగింది. గోదావరిలో ఈతకు వెళ్లి ఎనిమిది మంది చనిపోయింది. వాళ్లు కూడా ఓ ఫంక్షన్‌కి వెళ్లి అట్నుంచి సరాదాగా ఫ్రెండ్స్‌తో ఈతకు వెళ్లారు. నీళ్లలోకి దిగి ఆడుకుండా లోతు గుర్తించలేకపోయారు. ఒకరిని, మరొకరు కాపాడే ప్రయత్నంలో ఎనిమిది మంది చనిపోయారు.

ఈ వరుస ప్రమాదాలు ప్రభుత్వాలను ప్రశ్నించేలా చేస్తున్నాయి. ప్రమాదం జరిగితే హడావుడి చేసే రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం తర్వాత ఎందుకు పట్టించుకోవట్లేదన్న విమర్శలు వెల్లివెత్తున్నాయి. బోర్డులను ప్రదర్శించడం, తగిన హెచ్చరికలు జారీచేయడంలాంటి లేకపోవడం ఆగ్రహం తెప్పిస్తోంది. కనీసం వేసవిలోనైనా కొంతమేర ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కొంతవరకు చిన్నారులను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని బాధిత తల్లిదండ్రులు వాపోతున్నారు.