Anantapur: అనంతపురంలో యువతి దారుణ హత్య
మృగాళ్ల కర్కశత్వానికి మరో యువతి(20) బలైంది. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన తన్మయి విగతజీవిగా కనిపించింది. ఆమె తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డాక్టర్ల నుంచి పోస్టుమార్టం నివేదిక అందాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

అనంతపురంలో ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటున్న తన్మయి దారుణ హత్యకు గురైంది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక.. ఆదివారం శవమై కనిపించడం కలకలం రేపింది. మణిపాల్ స్కూల్ వెనుక అత్యంత దారుణమైన స్థితిలో బాలిక మృతదేహం లభ్యమైంది.
యువతి మృతితో కన్నీరుమున్నీరైన ఆమె తల్లిదండ్రులు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి కనిపించట్లేదని ఐదు రోజుల క్రితమే ఫిర్యాదు చేశామని.. అయినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు పట్టించుకుని ఉంటే తమ అమ్మాయి ప్రాణాలతో దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు అనుమానితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, యువతికి ముగ్గురు యువకులతో పరిచయం ఉన్నట్లు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. యువతిని మంగళవారం రాత్రి కూడేరు లిమిట్స్‌లోని మణిపాల్ స్కూల్ వెనుక బీర్ బాటిల్‌తో తల పగలగొట్టి హత్య చేశారని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
యువతి హత్యపై హోంమంత్రి అనిత స్పందించారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన అనిత.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థిని తన్మయి హత్య ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు మంత్రి లోకేష్. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టడం షాక్‌కు గురిచేసిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకి తావులేదన్న లోకేష్ తన్మయి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..