AP EAPCET 2025 Topper: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో సత్తా చాటిన హైదరాబాద్ కుర్రోడు.. ఇక్కడ సీటుకు మాత్రం నో ఛాన్స్!
రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2025 ఫలితాలు ఆదివారం (జూన్ 8) విడుదలైన సంగతి తెలిసిందే. జేఎన్టీయూ-కాకినాడ వీసీ ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 75.67శాతం ఉత్తీర్ణత నమోదైంది..

అమరావతి, జూన్ 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2025 ఫలితాలు ఆదివారం (జూన్ 8) విడుదలైన సంగతి తెలిసిందే. జేఎన్టీయూ-కాకినాడ వీసీ ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 75.67శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈఏపీసెట్ పరీక్ష నిర్వహించిన కేవలం 12 రోజుల్లోనే ప్రభుత్వం ఈ మేరకు ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈఏపీసెట్ పరీక్షకు రెండు విభాగాలకు కలిపి మొత్తం 3,62,448 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,40,300 మంది పరీక్ష రాశారు. వీరిలో 2,57,509 మంది అంటే 75.67 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
విభాగాల వారీగా చూస్తే.. మే 19 నుంచి 20 వరకు అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి నాలుగు సెషన్లలో పరీక్ష నిర్వహించగా.. 75,460 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 67,761 మంది అంటే 89.80 శాతం మంది అర్హత సాధించారు. ఇక మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు 10 సెషన్లలో జరగగా 2,64,840 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 1,89,748 మంది అంటే 71.65 శాతం మంది అర్హత సాధించారు.
తాజా ఫలితాల్లో టాప్ ర్యాంకులన్నీ అబ్బాయిలే కేవసం చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన అవనగంటి అనిరుధ్ రెడ్డి 96.39 మార్కులతో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మాండవ్యపురం భాను చరణ్ రెడ్డి 95.57 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. రాష్ట్ర విద్యార్ధులతోపాటు తెలంగాణ విద్యార్ధులు కూడా ఈఏపీసెట్ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. అయితే ర్యాంకులు తెచ్చుకున్నప్పటికీ తెలంగాణ విద్యార్ధులు ప్రవేశం పొందడానికి వీలులేదు. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో నాన్‌లోకల్ కోటాను ఎత్తివేస్తూ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.