Andhra Pradesh: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు.. వాతావరణ హెచ్చరిక
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఎండలు ఠారెత్తించనున్నాయని ప్రకటించింది...
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఎండలు ఠారెత్తించనున్నాయని ప్రకటించింది. ప్రజలకు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆగ్నేయ నుంచి నైరుతి దిశలో గాలులు వీస్తుండటంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలలో రాబోయే 3 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ అధికంగా నమోదవుతాయని అంచనా వేశారు. అటు రాయలసీమలో కూడా పొడి వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ కూడా ఎండలు మండిపోనున్నాయని తెలిపింది.
మరోవైపు బుధవారం(ఏప్రిల్ 12) 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ తెలిపారు.
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(04):-
అల్లూరి జిల్లా కూనవరం మండలం, కాకినాడ జిల్లా కోటనందూరు, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం, మండలాల్లో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(126):-
అల్లూరి జిల్లా 9,
అనకాపల్లి 14,
తూర్పు గోదావరి 16,
ఏలూరు 5,
గుంటూరు 6,
కాకినాడ 12,
కోనసీమ 1,
కృష్ణా 6,
ఎన్టీఆర్ 14,
పల్నాడు 1,
మన్యం 11,
శ్రీకాకుళం 7,
విశాఖ 3,
విజయనగరం 18,
వైయస్సార్ 3 మండలాలు
అటు మంగళవారం అనకాపల్లి 5, కాకినాడ 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు(8),
అల్లూరి 3, అనకాపల్లి 7,ఏలూరు 4, కాకినాడ 3, కృష్ణా 2, ఎన్టీఆర్, పల్నాడు, విశాఖ, విజయనగరం లో ఒక్కొక్క మండలంలో వడగాల్పులు నమోదైనవి.
వడదెబ్బకు ప్రధమ చికిత్స ఇలా..
వడదెబ్బ తగిలిన వ్యక్తిని ముందుగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆ తర్వాత అతడి శరీరాన్ని చల్లటి నీటిలో ముంచిన తడిగుడ్డతో తుడవండి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేవరకు ఇలా చేయండి. అనంతరం అతడ్ని చల్లని గాలి తగిలే ప్రదేశంలో ఉంచి గ్లూకోజ్/మజ్జిగ/ఓఆర్ఎస్ తాగించండి. ఇక వడదెబ్బ వల్ల అపస్మారక స్థితికి చేరిన వ్యక్తికి నీరు తాగించవద్దు. వీలయినంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లండి. కాగా, ఎండాకాలంలో పిల్లలు, గర్భిణీలు, వృద్దులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.