CM YS Jagan: ఏపీ సీఎంను కలిసిన షట్లర్ పీవీ సింధు, హాకీ ప్లేయర్ రజిని.. క్రీడాకారులకు అండగా ఉంటామన్న జగన్..
PV Sindhu - Hockey Player Rajani: అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న సింధు, రజనీలను సీఎం జగన్ అభినందించారు. రజనికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన సింధు.. బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2022లో తాను గెలిచిన బంగారు పతకాన్ని చూపించారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన విజయాల పట్ల పీవీ సింధును సీఎం జగన్ అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పి.వి. సింధు గోల్డ్ మెడల్ సాధించారు. ఈ పథకం సాధించిన తర్వాత తొలిసారిగా సీఎం జగన్‌ను కలిశారామె. మరోవైపు విమెన్స్ హాకీ ప్లేయర్ రజినీ కూడా సీఎంని కలిశారు. హాకీ టీమ్ ఆటోగ్రాఫ్‌లతో కూడిన హాకీ స్టిక్, టీమ్ టీ షర్ట్‌ను సీఎంకు బహుకరించారామె. కామన్వెల్త్ గేమ్స్ మహిళల హాకీలో గోల్‌కీపర్‌గా వ్యవహరించిన రజినీ.. కాంస్య పథకం రావడంతో తనవంతు పాత్ర పోషించింది.
అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న సింధు, రజనీలను సీఎం జగన్ అభినందించారు. రజనికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే.. క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు సీఎం జగన్. మున్ముందు మరిన్ని అంతర్జాతీయ వేదికలపై విజయబావుటా ఎగరేసి.. దేశం ఖ్యాతిని, తెలుగు జాతి గౌరవాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజాతో పాటు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి కూడా పాల్గొన్నారు.