Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి.. రోజురోజుకు పెరుగుతున్న నీటిమట్టం
శ్రీశైలం(Srisailam) ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయానికి వరద వస్తోంది. ఎగువ నుంచి ప్రస్తుతం 23,464 క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు తెలిపారు. జూరాల(Jurala) నుంచి 6,300 క్యూసెక్కులు,...

శ్రీశైలం(Srisailam) ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయానికి వరద వస్తోంది. ఎగువ నుంచి ప్రస్తుతం 23,464 క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు తెలిపారు. జూరాల(Jurala) నుంచి 6,300 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 8,554 క్యూసెక్కుల ప్రవాహం వస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. హంద్రీ నది నుంచి కూడా శ్రీశైలానికి 8,760 క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 821.10 అడుగులుగా ఉంది. వరద ఇలాగే కొనసాగితే డ్యామ్(Dam) త్వరలోనే నిండుకుండలా మారే అవకాశం ఉంది. మరోవైపు.. దేశంలోని అతి ముఖ్యమైన రిజర్వాయర్లలో ఒకటేన శ్రీశైలం డ్యామ్ కు ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా కమిటీ గతంలో హెచ్చరించింది. డ్యాం ప్రస్తుతం ఉన్న స్పిల్ వే సామర్థ్యానికి తగ్గట్టుగా లేదని దీంతో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీనికి పలు కారణాలు, పరిష్కారాలనూ సూచించింది.
శ్రీశైలం డ్యామ్ కు అంచనాలకు మించి గరిష్ఠంగా 26 లక్షల క్యూసెక్కుల వరద నీరు డ్యామ్ కు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత డ్యామ్ స్పిల్ వే సామర్థ్యం కేవలం 13.2 లక్షల క్యూసెక్కులు మాత్రమే. ఇంకా ఎక్కువ తీసుకుంటే 14.55 లక్షల క్యూసెక్కులకు మించదు. 2009లో లో ఏకంగా 25.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం డ్యామ్ ను తాకింది. అప్పట్లోనే స్పిల్వే పైన వరద నీరు ప్రవహించింది. ఇంత భారీ వరద వస్తే అన్ని గేట్లు ఎత్తి 14.8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలగలిగారు. దీంతో డ్యాంకు గరిష్ఠ వరద నీటి కి తగ్గట్లుగా స్పిల్వే సామర్థ్యం లేదని ఋజువైంది.
– నివేదికలోని అంశాలు




స్పిల్ వే గేట్ల నుంచి నీళ్లు కిందపడి మళ్లీ ఎగిరే ప్రాంతం ప్లంజ్ పూల్ లో ఏర్పడిన భారీ గొయ్యి డ్యామ్ కు ప్రమాదంగా ఉన్నట్లు హెచ్చరించింది. ఈ గొయ్యి పూడ్చివేతకు తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించింది. ప్లంజ్ పూల్ కు ఉన్న కుడి, ఎడమ గట్లను తదుపరి నష్టం రాకుండా కార్యాచరణ చేపట్టాలి. రివర్స్ స్లూయిస్ గేట్లు అత్యవసర సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున దృష్టి సారించాలి ఇప్పుడే.. అని పాండ్యా కమిటీ స్పష్టం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి