Andhra News: ఇలాంటి దొంగను మీరెప్పుడూ చూసుండరు..! రికార్డ్స్ చూసి నోరెళ్లబెట్టిన పోలీసులు!
గత కొన్ని రోజులుగా జిల్లాలో రాత్రి పూట వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితుడిపై సుమారు 18 కేసులు ఉన్నట్టు గుర్తించారు. అతడి నుంచి 237 గ్రాముల బంగారం, 1,391 గ్రాముల వెంటి, లక్షా యాబైవేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

శ్రీకాకుళం రూరల్, శ్రీకాకుళం 2 టౌన్ , శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత కొంతకాలంగా అర్ధ రాత్రి ఇండ్లలో చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాడు దున్న కృష్ణతో పాటు మరో వ్యక్తిని జిల్లా పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇతనిపై మొత్తం 18కిపైగా కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇతనిపై శ్రీకాకుళం రూరల్ – 14 కేసులు, శ్రీకాకుళం 2 టౌన్ – 03 కేసులు, శ్రీకాకుళం 1 టౌన్ – 01 కేసులు ఉన్నాయి.
అయితే ఆతనిపై శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే 18 కేసులు ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 218 కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. ఇతను గత 33 ఏళ్లుగా నిరంతరంగా దొంగతనాలు చేస్తున్నాడని.. ఇప్పటి వరకు 60 కేసుల్లో శిక్ష అనుభవించాడని, తన జీవితంలో సగం కాలం జైలు జీవితం గడిపాడని పోలీసులు చెబుతున్నారు. ఏ విధమైన వ్యక్తిగత గుర్తింపు కార్డు, మొబైల్ ఫోన్ వాడకపోవడం,కలకత్తా నుండి శ్రీకాకుళం వచ్చి, దొంగతనాలు చేసి తిరిగి వెళ్లిపోవడం అతని పద్ధతి.
అత్యంత చురుకైన తాళాలను సైతం ఇతను ఈజీగా పగలగొట్టి దొంగతనం చేయగలడు. అయితే ఒక కేసులో ఇతను జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఇతనికి A-2 రఫీకి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో కృష్ణ దొంగిలించిన బంగారం, వెండిని రఫీ కొనుగోలు చేసి, తనకు తెలిసిన వ్యక్తులకు అమ్మేవాడు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సోనాపూర్ ప్రాంతానికి చెందిన అంతన్షఫుల్, తరణ్ మండల్ అనే వ్యక్తులకు కూడా దొంగ సొత్తును అందజేసినట్లు ఒప్పుకున్నాడు. వారిని కూడా త్వరలో అరెస్టు చేయనున్నామని ఎస్పీ తెలిపారు.
అయితే కోన్ని కేసుల్లో బాధితులు తప్పుగా ఎక్కువ బంగారం పోయినట్లు ఫిర్యాదు చేశారని వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలియజేశారు. పట్టుబడిన ఈ ఇద్దరి నుంచి సుమారు రూ. 33.25 లక్షల విలువైన బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
