Annamayya District: అన్నమయ్య జిల్లాలో విషాదం.. ‘లోన్ యాప్’ వేధింపులకు సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆత్మహత్య..
రుణ యాప్ వేధింపులకు తాళలేక మరొకరు బలవణ్మరణానికి పాల్పడ్డారు. తీసుకున్న అప్పు తీర్చలేదని నిత్యం అసభ్యపదజాలంతో దూషిస్తూ మానసికంగా కృంగదీశారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్‌వేర్ ఇంజనీర్ ఉరిపెట్టుకుని ఆత్మహత్య..
రుణ యాప్ వేధింపులకు తాళలేక మరొకరు బలవణ్మరణానికి పాల్పడ్డారు. తీసుకున్న అప్పు తీర్చలేదని నిత్యం అసభ్యపదజాలంతో దూషిస్తూ మానసికంగా కృంగదీశారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్‌వేర్ ఇంజనీర్ ఉరిపెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం..
దయ్యాలవారిపల్లెకు చెందిన రైతు జయరామిరెడ్డి కుమారుడు ఎస్ శ్రావణ్ కుమార్ రెడ్డి (24). బీటెక్ పూర్తిచేసిన తర్వాత ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఓ అవసరం నిమిత్తం ఆరు నెలల కిందట రుణయాప్‌లో శ్రావణ్ అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పులో రూ.3.50 లక్షల వరకు చెల్లించాడు. అయినా యాప్ నిర్వహాకులు నిత్యం వేధింపులు కొన సాగించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. దీంతో రూ.4 లక్షలు కావాలని తండ్రిని కోరడంతో.. వారం రోజుల్లో సర్దుబాటు చేస్తానని తండ్రి జయరామిరెడ్డి చెప్పాడు. ఈ నేపథ్యంలో మే 26న డబ్బు ఇచ్చేందుకు కొడుకుకు కబురు పంపాడు.
ఇంతలో శ్రావణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ నుంచి తన బంధువుల ఊరైన మొరంపల్లెకు వెళ్లాడు. అక్కడ ఓ దేవాలయంలోని కిటికీ కమ్మీలకు బుధవారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరుసటి రోజు స్థానికులు గమనించి తల్లీదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రావణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రుణయాప్ వేధింపుల కారణంగా శ్రావణ్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్‌ఐ రామ్మోహన్ మీడియాకు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.