Andhra Pradesh: అనుమతిలేని స్కూల్స్‌పై ఏపీ ప్రభుత్వం కొరడా.. బ్రదర్ స్కూల్ పేరుతో నడుపుతున్న నారాయణ స్కూల్ సీజ్
ప్రకాశం జిల్లాలో నారాయణ విద్యా సంస్థకు అధికారులు షాక్ ఇచ్చారు. అనుమతి లేదంటూ కనిగిరిలో నారాయణ స్కూల్‌ను సీజ్ చేశారు అధికారులు. నారాయణ స్కూల్ పేరు మీద పర్మిషన్ లేకుండా పాఠశాల నడుపుతున్నారని ఆరు నెలల ముందే యాజమాన్యానికి నోటీసులు అందజేసిన పట్టించుకోలేదన్నారు మార్కాపురం డిప్యూటీ డిఈవో చంద్రమౌళీశ్వరరావు
అనుమతిలేని స్కూల్స్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. విద్యార్థుల ఫ్యూచర్‌కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అకడమిక్ ఇయర్ స్టార్టింగ్‌లోనే కీలక చర్యలకు దిగుతున్నారు ఏపీ విద్యాశాఖ అధికారులు. దానిలో భాగంగానే.. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే.. ఏపీలో నారాయణ విద్యా సంస్థలకు షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో గుర్తింపు కలిగిన బ్రదర్ స్కూల్ పేరు మీద ఎలాంటి పర్మిషన్ లేని నారాయణ స్కూల్‌ను నడుతున్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆర్జీడీ ఆదేశాల మేరకు ఎంఈవోతో కలిసి డిప్యూటీ డీఈవో చంద్రమౌళీశ్వరరావు పాఠశాలను సీజ్ చేసేందుకు వెళ్లారు. అయితే.. స్కూలుకు తాళాలు వేసేందుకు ప్రయత్నించగా.. నారాయణ స్కూల్ యాజమాన్యం అడ్డుపడింది. దాంతో.. విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం మూడు గంటల సమయంలో పోలీసు సిబ్బందితో వచ్చి నారాయణ స్కూల్‌ను సీజ్ చేశారు.
నారాయణ స్కూల్ పేరు మీద పర్మిషన్ లేకుండా పాఠశాల నడుపుతున్నారని ఆరు నెలల ముందే యాజమాన్యానికి నోటీసులు అందజేసిన పట్టించుకోలేదన్నారు మార్కాపురం డిప్యూటీ డిఈవో చంద్రమౌళీశ్వరరావు. నోటీసులు ఇచ్చినా విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా విద్యా శాఖ అధికారులు స్కూల్ జోలికి వెళ్లలేదని చెప్పారు. ప్రస్తుతం నారాయణ స్కూల్లో అడ్మిషన్లు జరుగుతుండటంతో.. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే గతంలో ఇచ్చిన నోటీసులతో చర్యలు దిగారు అధికారులు. ఆ నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో నారాయణ స్కూల్‌ను సీజ్ చేశామన్నారు డిప్యూటీ డీఈవో. మొత్తంగా.. గుర్తింపు లేకుండా స్కూల్ రన్ చేస్తున్నారంటూ కనిగిరిలో నారాయణ స్కూల్‌ను సీజ్ చేశారు విద్యా శాఖ అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..