AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikakulam District: నాగుల చవితి పర్వదినాన అద్భుత దృశ్యం..

నాగుల చవితి రోజున అరుదైన దృశ్యం. రెండు పాములు పెన వేసుకుని.. నాట్యం చేస్తూ కనిపించాయి. చుట్టు పక్కల స్థానికులు దూరం నుండి పాముల నాట్యాన్ని చూసి తిలకించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Srikakulam District: నాగుల చవితి పర్వదినాన అద్భుత దృశ్యం..
Snakes Dance
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2024 | 11:42 AM

Share

నాగుల చవితి పర్వదినాన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా భక్తులు నాగుల చవితిరోజు కుటుంబంలోని చిన్నా, పెద్దా అందరూ కలిసి పుట్టలో పాలు పోసి నాగదేవతను పాము రూపంలో ఆరాధిస్తారు. తమ పిల్లలను, కుటుంబాన్ని చల్లగా చూడమని ఆ సుభ్రమణ్యుని వేడుకుంటారు. సంతానం లేనివారు నాగులచవితి, నాగపంచమి రోజున పుట్టలో పాలుపోసి నాగదేవతను ఆరాధిస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. అలాంటి నాగదేవతను ఆరాధించేందుకు పుట్టవద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు భక్తులు. అయితే వారికి మార్గ మధ్యలో అద్భుతమైన దృశ్యం వారి కంటపడింది. నాగుపాము, జెర్రిపోతు సయ్యాటలాడుతూ కనిపించాయి. నాగుల చవితి పర్వదినాన ఇలా జంటపాముల దర్శనంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలోని సూర్యకాలనీలో చోటుచేసుకుంది.

పొదల్లోనుంచి సయ్యాటలాడుతూ రోడ్డుమీదకు వచ్చిన జంటపాములు చుట్టూ గుమిగూడిన జనాల అలజడిని కూడా పట్టించుకోకుండా సయ్యాటలాడాయి. ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా మనుషుల కంటపడుతుంటాయి. కార్తీక మాసం, మంగళవారం, నాగుల చవితి పర్వదినం ఈ పుణ్యదినాన జంటపాముల సయ్యాట దృశ్యం చూసి భక్తులు ఆనందంతో దర్శనం చేసుకున్నారు. మంగళవారం సుభ్రమణ్యునికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఈరోజు ప్రత్యక్షంగా స్వామి దర్శనం కలిగిందని, ఇది తమ అదృష్టం అంటూ భక్తులు భక్తితో నమస్కరించి పూజలు చేశారు. జంటపాములు సయ్యాటలాడుతున్న స్థలంలో తెల్లని నూతన వస్త్రాలు పరిచి, పసుపు కుంకుమలు, నైవేద్యాలతో పూజలు చేశారు. భక్తితో నమస్కరించారు. సయ్యాట ముగిసిన అనంతరం జంటపాములు తలో దిక్కూ వెళ్లిపోయాయి. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.