Weather: మరికొద్ది గంటల్లో తుఫాన్‌గా తీవ్రవాయుగుండం.. ఉప్పాడలో తీరంలో అల్లకల్లోలం
AP Weather Forecast: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం సాయంత్రానికి తుపానుగా మారి మే 26 రాత్రికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను గంటకు 110-120 కి.మీ వేగంతో తీరం దాటే అవకాశం ఉందని, గంటకు 135 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం మరికొద్ది గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌గా మారితే రెమాల్ అని పేరు పెట్టనున్నారు. ఇది ఆదివారం రాత్రికి తీవ్ర తుఫానుగా బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ మధ్య తీరం దాటనుందని వెల్లడించింది. ఈ క్రమంలో.. కోస్తాలోని ప్రధాన పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రధాన హెచ్చరిక జారీ చేసింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఉందని తెలిపింది. పశ్చిమ మధ్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయని.. వాటి ప్రభావంతో కోస్తా లోను వాతావరణం చల్లబడిందని వెల్లడించింది. రాయలసీమలో కొన్ని ప్రాంతాలు మేఘవృతమై ఉన్నాయని తెలిపింది. రెండు రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు.. ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని.. మత్స్యకారులు వేటకి వెళ్లొద్దని అధికారులు సూచించారు. గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడు, రెండు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు వివరించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడలో తీరం అల్లకల్లోలంగా మారింది. ఉదయం నుంచి సముద్రుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. రాకాసి అలలు ప్రభావంతో బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కెరటాలు వాహనదారులపైకి దూసుకవస్తున్నాయి. ఒక్కసారిడి నీటిమట్టం పెరిగి, సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు భయాందోళనలో ఉన్నారు. సెల్ఫీల మోజులో సముద్రపు అలలతో యువత చెలగాటమాడుతున్నారని.. ఇది చాలా డేంజర్ అని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…