Visakhapatnam: సీపీ అయ్యనార్ ఆపరేషన్ సక్సెస్.. 48 గంటల్లోనే ఇంటికి చేరిన బాధితులు..!
విశాఖలో అయ్యనార్ ఆపరేషన్ సక్సెస్.. 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు. కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ బాధితులకు సీపీ రవిశంకర్ అయ్యనార్ బాసటగా నిలిచారు. సైబర్ క్రైమ్ గ్యాంగ్ చేతిలో చిత్రహింసలకు గురైన వారిని విశాఖకు రప్పించి శభాష్ అనిపించుకున్నారు. ఇంతకీ.. కంబోడియాలో విశాఖ వాసులు ఎందుకు చిక్కుకున్నారు?.. వారిని రప్పించేందుకు అయ్యనార్ చేసిన ఆపరేషన్ ఏంటి?
విశాఖపట్నంలో అయ్యనార్ ఆపరేషన్ సక్సెస్.. 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు. కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ బాధితులకు సీపీ రవిశంకర్ అయ్యనార్ బాసటగా నిలిచారు. సైబర్ క్రైమ్ గ్యాంగ్ చేతిలో చిత్రహింసలకు గురైన వారిని విశాఖకు రప్పించి శభాష్ అనిపించుకున్నారు. ఇంతకీ.. కంబోడియాలో విశాఖ వాసులు ఎందుకు చిక్కుకున్నారు?.. వారిని రప్పించేందుకు అయ్యనార్ చేసిన ఆపరేషన్ ఏంటి?…
సైబర్ క్రైమ్ కేటుగాళ్లు రోజుకో రూటులో నేరాలు చేస్తూ రెచ్చిపోతూనే ఉన్నారు. రూట్ చేంజ్ అంటూ.. ఇప్పుడు కొత్త పంథా ఎంచుకున్నారు. ఉద్యోగాల పేరుతో భారతీయులను వాళ్ల దేశాలకు తీసుకెళ్లి.. మన కంటిని మన వేళ్లతోనే పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అవును.. సరిగ్గా ఇలాంటి కేసే విశాఖలో వెలుగులోకి వచ్చింది. కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు విశాఖ పోలీసులు. ఒక వ్యక్తి ఫిర్యాదుతో కంబోడియా గ్యాంగ్ డొంకనే పెకిలించారు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యనార్. ఈ కేసులో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్ బాగోతాన్ని గుర్తించడమే కాదు.. మానవ అక్రమ రవాణా కోణాన్ని వెలికి తీశారు.
కంబోడియా మాఫియా నుంచి తప్పించుకుని వచ్చిన వ్యక్తి ఫిర్యాదుతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేయగా.. సీపీ రవిశంకర్ అయ్యనార్ స్పెషల్ ఫోకస్‌తో బండారం బట్టబయలైంది. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లి యువత మోసపోయినట్లు తేల్చారు సీపీ అయ్యనార్. ఆ వెంటనే.. భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి.. కంబోడియా కేటుగాళ్ల చేతుల్లో చిక్కుకున్న బాధితులకు విముక్తి కల్పించారు. సీపీ రవిశంకర్ అయ్యనార్ ప్రత్యేక చొరవతో ఎట్టకేలకు కంబోడియా బాధితులు విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక బ్యానర్ ప్రదర్శిస్తూ స్వాగతం పలికి అక్కున చేర్చుకున్నారు పోలీసులు.
ఇక.. ఈ కేసులో ఇప్పటికే విశాఖకు చెందిన ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా వివరాలు, వారి మోసాలపై CP రవిశంకర్ అయ్యానార్ దృష్టి సారించారు. కొందరు విశాఖ ఏజెంట్లు.. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో 150 మంది నిరుద్యోగులను పంపడంతో కాంబోడియా గ్యాంగ్ నిర్బంధించినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన తర్వాత భారతీయుల వీసాలు చించివేయడంతో ఆ కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారని.. ఇలా.. దేశవ్యాప్తంగా కంబోడియా గ్యాంగ్ చేతిలో సుమారు 5వేల మంది చిక్కుకున్నట్లు దర్యాప్తులో తేలడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అన్ని రకాల లాంగ్వేజ్‌లు మాట్లాడేలా.. వివిధ రాష్ట్రాల వారిని తీసుకెళ్లి నిర్బంధించినట్లు వెల్లడైంది. అంతేకాదు.. మనవాళ్లకు పలు రకాల స్కామ్‌ల్లో ట్రైనింగ్ ఇచ్చి.. మనదేశంపైనే సైబర్ ఎటాక్ చేయిస్తుండడం సంచలనంగా మారింది.
ఇక.. కంబోడియా గ్యాంగ్ మన వాళ్లను అక్కడికి ఎలా తీసుకెళ్తున్నారు?.. మనవాళ్లతో సైబర్ నేరాలు ఎలా చేయిస్తున్నారు? ఆ గ్యాంగ్ గుట్టు ఎలా రట్టు చేశారు?.. అనే కీలక విషయాలను వెల్లడించారు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యనార్. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో విశాఖ ఏజెంట్లు నిరుద్యోగులను కంబోడియా ఏజెంట్లకు అమ్మేస్తున్నారన్నారు. ఇలా చేయడం ద్వారా విశాఖ ఏజెంట్లకు కంబోడియా గ్యాంగ్ ఒక్కొక్కరికి 50వేలు చొప్పున ఇస్తున్నారని తెలిపారు.
విశాఖకు తిరిగి రప్పించడం పట్ల కంబోడియా బాధితులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్నారు సీపీ రవిశంకర్ అయ్యనార్. విశాఖ పోలీసులు ఇచ్చిన ధైర్యంతోనే కంబోడియా గ్యాంగ్ చిత్రహింసలపై పోరాటం చేసినట్లు చెప్పారన్నారు. ఇదిలావుంటే.. ఇకపై విదేశాల్లో ఉద్యోగాల కోసం రిజిష్టర్డ్ ఏజెంట్ల ద్వారానే వెళ్లాలని టీవీ9 వేదికగా నిరుద్యోగులకు సూచించారు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యనార్. విశాఖలో 70 నుంచి 80 మంది వరకు ఫేక్ ఏజెంట్లు ఉన్నారని.. వాళ్లందరికి హ్యూమన్ ట్రాఫికింగ్‌పై వార్నింగ్ ఇస్తామన్నారు.
మొత్తంగా.. కంబోడియా కేటుగాళ్ల కేసులో విశాఖ సీపీ రవిశంకర్ అయ్యనార్ ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయింది. కంబోడియాలోని ఇండియన్ ఎంబసీ సహకారంతోనే 48 గంటల్లో బాధితులను తీసుకొచ్చి శభాష్ అనిపించుకున్నారు. ఇక.. దేశ వ్యాప్తంగా జరిగిన సైబర్ స్కామ్‌కు సంబంధించి డొంక కదిలించేందుకు సిద్ధమవుతున్నారు విశాఖ పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…