Andhra: ఏందిరా ఇది.! పని మనిషికి ఇంటి మనిషిగా అక్కున చేర్చుకుంటే.. ఒంటరిగా గదిలోకి వచ్చి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. సొంత మనిషిలా నటిస్తూ హత్య చేసేందుకు వెనుకాడని దుర్మార్గుడి నిర్వాకాన్ని బయటపెట్టారు. వృద్ధ దంపతులు జయమ్మ, మహాదేవరెడ్డిపై కత్తితో దాడి చేసిన దుండగుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.

శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో ఉంటున్న శ్రీకాళహస్తి రూరల్ వైసీపీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై గత నెల 26న గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. జయమ్మ, మహదేవ్ రెడ్డిలపై దాడి చేసి.. వారి వద్ద ఉన్న నగలు దోచుకెళ్లారు. ఈ ఘటనలో 80 ఏళ్ల జయమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. మహాదేవరెడ్డి ఛాతిపై కత్తిపోట్లతో పరిస్థితి విషమించడంతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. దాడికి గురైన వృద్ధ దంపతులు శ్రీకాళహస్తి రూరల్ వైసీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులుగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 12 రోజుల్లో కేసును చేధించిన పోలీసులు డబ్బు కోసమే హత్య జరిగినట్లు గుర్తించారు.
ఒంటరిగా ఉంటున్న జయమ్మ, మహాదేవ రెడ్డిపై పక్కా ప్లాన్‌తోనే గత నెల 26న కత్తులతో దాడి చేసినట్లు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రమేష్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. నిందితుడి నుంచి బైక్, బంగారం, దాడికి ఉపయోగించిన హ్యాండ్ కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి మధుసుధన్ రెడ్డి తల్లిదండ్రులపై జరిగిన దాడి వివరాలను ఎస్పీ సుబ్బారాయుడు వివరించారు. మహదేవరెడ్డికి చెందిన పొలంలో వ్యవసాయ పనులు.. ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ కుటుంబానికి నమ్మకంగా ఉంటున్న రమేష్ రెడ్డే పక్కా ప్లాన్‌తో ఈ హత్య చేసినట్లు సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నామన్నారు. అప్పులు ఉండడం, తీర్చడం కష్టంగా ఉండటంతో రమేష్ రెడ్డి ఆర్ధిక ఇబ్బందులతో దొంగతనానికి పాల్పడి దాడి చేసినట్లు తెలిసిందన్నారు ఎస్పీ సుబ్బరాయుడు. మహదేవ రెడ్డి ఇంట్లో దొంగతనం చేయాలనుకున్న రమేష్ రెడ్డి గత నెల 26న రాత్రి హ్యాండ్ కట్టర్, ముఖానికి గుడ్డకట్టుకుని కారంపొడితో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇంటి గ్రిల్‌ను మిషిన్ కట్టర్‌తో కట్ చేసి లోపలికి వెళ్లిన రమేష్ రెడ్డిని దొంగగా భావించి ప్రతిఘటించిన జయమ్మ.. అతడి కత్తిపోట్లకు గురైంది. జయమ్మ చేతిలో ఉన్న రెండు బంగారు గాజులు, బెడ్‌పై ఉన్న బంగారు గొలుసు, ఫోన్ తీసుకొని అక్కడి నుంచి రమేష్ రెడ్డి పరారీ అయ్యాడు. విచారణలో రమేష్ రెడ్డిపై అనుమానం రావడంతో అతనిపై నిఘా పెట్టిన పోలీసులు కేసును చేధించారు. రమేష్ రెడ్డిని అరెస్ట్ చేసి దొంగిలించిన మంగళసూత్రం, రెండు బంగారు గాజులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు తిరుపతి ఎస్పీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చేయండి








