Andhra News: ఫ్రెండ్స్‌తో ఫుల్‌గా డిచ్ అయ్యారు.. ఇంటికెళ్దామని బయల్దేరారు.. అంతలోనే
అన్నమయ్య జిల్లా బండ వడ్డిపల్లిలో సంక్రాంతి సంబరం విషాదంగా మారింది. బెంగళూరు నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మణికుమార్, పుష్పరాజ్‌లు స్నేహితులతో కలిసి గుట్టపై మద్యం సేవించారు. అతి మత్తులో గుట్టపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి, మద్యం సేవించిన స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. అతి మద్యాపానమే మృతికి కారణమని డీఎస్పీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన స్థానికంతా తీవ్ర విషాదాన్ని నింపింది.

అన్నమయ్య జిల్లా కెవి పల్లి మండలం బండ వడ్డిపల్లిలో సంక్రాంతి సంబరం విషాదాన్ని మిగిల్చింది. పండుగకు సొంతూరుకు వచ్చిన స్నేహితులు సరదాగా గడపాలని ఓ గుట్టుపైకి వెళ్లారు. కానీ ప్రమాదవశాత్తు దానిపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. బండ వడ్డిపల్లికి చెందిన మణికుమార్, పుష్పరాజ్ అనే ఇద్దరు స్నేహితులు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే సంక్రాంతి పండగ నేపథ్యంలో వీరిద్దరూ సోంతూరైన బండ వడ్డిపల్లికి వచ్చిచారు. మణి కుమార్, పుష్పరాజ్ లు సంక్రాంతి పండుగను సొంతూరులో సంతోషంగానే జరుపుకున్నారు.
అయితే శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణి కుమార్, పుష్ప రాజ్‌లు అదే గ్రామానికి చెందిన స్నేహితులు సమీప బంధువులైన అభిషేక్, వేణుగోపాల్, శ్రావణ్, శివమణిలతో కలిసి గ్రామం సమీపంలోని గుట్టపైకి చేరుకున్నారు. అక్కడ కాసేపు ప్రకృతిని ఆస్వాధించి.. ఆ తర్వాత పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో భాగంగా ఆరుగురు స్నేహితులు తమ వెంట తీసుకెళ్లిన మద్యం సేవించారు. రాత్రి వరకు అక్కడే ఉన్నారు. చీకటి పడడంతో ఇంటికెళ్లేందుకు బయల్దేరారు. ఫుల్‌గా మద్యంమత్తులో ఉండడంతో గుట్ట దిగే క్రమంలో మణి కుమార్, పుష్పరాజ్ గుట్టపై నుంచి పడిపోయారు.
గమనించిన స్నేహితులు వారిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే పల్స్ పడిపోవడంతో మణికుమార్, పుష్ప రాజ్ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి.. మృతులతో కలిసి మద్యం సేవించిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు వెళ్లి ఘటనా స్థలాన్ని పరీశీలించారు. అక్కడ దొరికి బీర్ టిన్స్ ఆధారంగా వీరు అతిగా మద్యం సేవించడంతోనే మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
మత్తే మృతికి కారణం!
ఇద్దరు యువకుల మృతిపై స్థానిక డీఎస్పీ కృష్ణమోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. మృతి చెందిన ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారని తెలిపారు. సంక్రాంతి పండుగకు గ్రామానికి వచ్చారని శనివారం మధ్యాహ్నం మణికుమార్, పుష్పరాజ్ స్నేహితులు సమీప బంధువులు ఆరుగురుతో కలిసి మద్యం సేవించారన్నారు. అతిగా మద్యం సేవించి వస్తుండగా కిందపడిపోయారని, ఈ ప్రమాదంలో గాయపడి వారు మృతి చెందినట్టు ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పోస్టుమార్టం నివేదిక తర్వాత మృతికి గల అసలైన కారణాలు వెల్లడిస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
