Andhra: ఓర్నాయనో.! శ్వేతనాగు పడగకు సర్జరీ.. వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది
పాము పేరు వినగానే చాలామందికి ఒళ్ళు జలదరిస్తుంది.. అటువంటి పాము కళ్ళ ముందు కనిపిస్తే గుండెలు పట్టుకొని పరుగులు తీసే పరిస్థితి ఎదురవుతుంది.. కానీ ఓ భారీ పాము తో జనం హడాలెత్తుతున్నారన్న సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్.. ఆ పామును రెస్క్యూ చేయడమే కాదు.. పడగకు ఉన్న గాయానికి వైద్యం చేయించి మానవత్వాన్ని చాటుకున్నాడు.

విశాఖ సింధియా పరిధిలోని నేవల్ క్యాంటీన్ సమీపంలో ఓ అట్ట డబ్బాలో దూరింది నాగు పాము. అది కూడా ఆరడుగుల శ్వేత నాగు. తల తల మెరుస్తూ ముందుకు కదులుతున్న పామును స్థానికులు చూశారు. ఆ తరువాత హడలెత్తి ఓ అట్ట డబ్బాలోకి వెళ్లి పోయింది. సమాచారాన్ని స్నేక్ క్యాచర్ నాగరాజుకు అందించారు స్థానికులు. రంగంలోకి దిగిన నాగరాజు.. శ్వేతనాగును చాకచక్యంగా రెస్క్యూ చేశాడు. అదే క్రమంలో పడగ విప్పిన ఆ పామును చూసిన నాగరాజు.. పాము పడగకు గాయాలు ఉండడాన్ని గమనించాడు.
వెంటనే చలించి చికిత్స కోసం షిప్పియాడు కాలనీలో ఉన్న ప్రభుత్వ పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ.. వెటర్నరీ డాక్టర్ సునీల్ కుమార్ నేతృత్వంలో ఆ పాముకు చికిత్స చేయించాడు. శ్వేత నాగు పడగకు జాగ్రత్తగా శాస్త్ర చికిత్స చేశారు వైద్యులు సిబ్బంది. దాదాపు 8 వరకు కుట్లు వేశారు. ముంగిస లాంటి జంతువుల దాడి తో పాము గాయపడి ఉంటుందని అనుమానిస్తున్నారు.
పాముకు సపర్యలు చేసి కాస్త కోలుకున్న తర్వాత అడవిలో విడిచిపెడతానని చెబుతున్నాడు స్నేక్ క్యాచర్ నాగరాజు. పాముల నుంచి మనుషులను రక్షించడమే కాదు.. పాము కు జరిగిన గాయాన్ని కూడా గుర్తించి ఆ పాముకు ఎటువంటి హాని తలపెట్టకుండా వైద్య సహాయం అందించి కోనుకునేలా చేస్తున్న నాగరాజుకు అందరూ అభినందిస్తున్నారు.
