భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు సిద్దం చేస్తున్న భక్తులు.. వీటి ప్రాముఖ్యత ఇదే..
భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవంలో కల్యాణ తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అప్పటి తానీషా ప్రభువు భద్రాద్రి రామయ్యకు బుక్కా గులాలు, ఆవునెయ్యి, అత్తరు తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపి కేవలం గోళ్ళతో వలిచిన తలంబ్రాలను పంపడం ఆనవాయితీ. సుగంధద్రవ్యాలు కలిసిన ఆ తలంబ్రాలు ఎరుపు రంగులో ఉండేవి.
భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవంలో కల్యాణ తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అప్పటి తానీషా ప్రభువు భద్రాద్రి రామయ్యకు బుక్కా గులాలు, ఆవునెయ్యి, అత్తరు తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపి కేవలం గోళ్ళతో వలిచిన తలంబ్రాలను పంపడం ఆనవాయితీ. సుగంధద్రవ్యాలు కలిసిన ఆ తలంబ్రాలు ఎరుపు రంగులో ఉండేవి. అప్పటి నుంచి వివిధ రకాల సుగ్రంధ ద్రవ్యాలతో తయారు చేసిన తలంబ్రాలను మాత్రమే రాముల వారి కల్యాణంలో వినియోగిస్తున్నారు. నిత్య కల్యాణంలో మాత్రమే పసుపు తలంబ్రాలను వినియోగిస్తూ, ఏడాదికొకసారి జరిగే నిజ కళ్యాణంలో మాత్రమే ఇలా సుగంధద్రవ్యాలతో తయారుచేసిన ఎరుపురంగు తలంబ్రాలను వినియోగిస్తున్నారు. ఈ ఏడాది సీతారాముల కళ్యాణానికి వినియోగించే తలంబ్రాలను ఇప్పటికే గోటితో వలిచి సిద్దం చేశారు. ఈ తలంబ్రాలను తొలుత పసుపు కలిపి తయారుచేసేందుకు సాంప్రదాయబద్దంగా పసుపుకొమ్ములను రోట్లో దంచే కార్యక్రమాన్ని బాపట్లజిల్లా చీరాలలో ప్రారంభించారు. ఈ పసుపు దంచే కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
భద్రాచలంలోని శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ కార్యక్రమాలలో వినియెగించే తలంబ్రాలు బాపట్ల జిల్లా చీరాలలోని రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో గడచిన 11 సంవత్సరాలుగా సిద్ధం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈక్రమంలోనే భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సిద్ధం చేస్తున్న గోటి కోటి తలంబ్రాలు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తలంబ్రాలలో కలిపే పసుపును దంపే కార్యక్రమం భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆంజనేయ స్వామికి విశేష పూజలు జరిపారు. గత 11 ఏళ్లగా భద్రాచలం ఎండోమెంట్ అధికారుల అనుమతితో చీరాలలో స్వామి వారి కళ్యాణ తలంబ్రాలను సిద్ధం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మొదట ఒక ఊరికే పరిమితమైన తలంబ్రాలు వలిచే ఘట్టంలో నేడు ఐదు దేశాల ప్రజలు పాల్గొంటున్నారని తెలిపారు. శ్రీరామనవమికి భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం సమయానికి తలంబ్రాలను చీరాల నుంచి భద్రాచలం తరలిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…