Andhra Pradesh: తెల్లవారుజామున పూరి – తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..
కొత్త సంవత్సరం మొదలైన కొద్దిరోజులకే తుని వద్ద పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. గతంలో విశాఖ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా తరలించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద కారణాలపై క్లూస్ టీం దర్యాప్తు చేపట్టింది.

కొత్త సంవత్సరం మొదలై వారం రోజులే గడిచింది.. అప్పుడే జరిగిన రైలు ప్రమాదం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. గత సంవత్సరం చివరిలో విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవదహనమయ్యారు. ఆ సంఘటన మరువక ముందే తాజాగా తుని సమీపంలో పూరి తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. పూరీ నుండి తిరుపతి వెళ్తున్న 17479 ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన రైల్వే వెంటనే రైలును ఆపేశారు. రైలు రాజమండ్రి స్టేషన్‌లో నిలిచిపోయింది.
కాకినాడ జిల్లా తుని – అన్నవరం రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుంది. తెల్లవారుజాము సుమారు 5 గంటల ప్రాంతంలో ఒక బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రైలులోని బీ5 బోగీలో నుంచి పొగలు రావడం గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
ప్రమాదానికి గల కారణాలపై క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీలతో దర్యాప్తు చేపట్టారు. రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు వచ్చిన బోగీని పరిశీలించారు.. ఈ ఘటనతో కొంతసేపు రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటా 40 నిమిషాల పాటు రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో రైలును అధికారులు నిలిపివేశారు. విస్తృత తనిఖీల తర్వాత రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి రైలు బయలుదేరి వెళ్లింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




