రాత్రి, పగలనే తేడానే లేదు.. ఆ గ్రామంలో క్షణక్షణం భయం భయం.. ఇంతకు అక్కడ ఏం జరుగుతోంది!
మార్కాపురం జిల్లా బొమ్మలాపురం సమీపంలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా ఆవుల మందపై దాడి చేసి ఒకదానికి గాయాలు చేసింది. గతంలోనూ పలు పశువులు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. నల్లమల అటవీ ప్రాంతం నుండి పొలాల్లోకి వస్తున్న పులితో రైతులు, పశువుల కాపరులు రాత్రివేళల్లో బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మార్కాపురం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలోని దేవలూటి వద్ద మేతకు వెళ్ళిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఆవు తీవ్రంగా గాయపడింది. గమనించిన పశువుల కాపరి కేకలు వేయడంతో.. అవును వదిలేసిన పులి.. ఒక్కసారిగా కాపరిపై దూసుకెళ్లింది.. ఇంతలో అక్కడున్న వారంతా కర్రలతో బెదిరించడంతో అక్కడి నుంచి జారుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. గ్రామ సమీపంలోని పొలాల వద్ద పెద్ద పులి సంచరిస్తుండటంతో రాత్రి వేళ పంటలకు కాపలా వెళ్ళేందుకు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
రెండు నెలల క్రితమే ఓ ఆవుపై దాడి
అయితే ఇక్కడ పెద్దపులి దాడి చేయడం ఇదే తొలిసారి ఏం కాదు. గత రెండు నెలల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలోని బొమ్మలాపురంలో తుంగుడు దగ్గర ఓ ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఆవుల మందలోని కోడె దూడ ప్రాణాలుకోల్పోయింది. మిగిలిన పశువులు భయంతో పరుగులు తీశాయి. దీంతో పశువుల కాపరులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బొమ్మలాపురం సమీపంలోని గండి చెరువు, తుంగుడు ప్రాంతాల్లో పదే పదే పెద్దపులి సంచరిస్తుండటంతో పొలాలకు వెళ్ళేందుకు రైతులు, పశువుల కాపరులు జంకుతున్నార. ఇప్పటికే పులిదాడిలో పదుల సంఖ్యలో పశువులు చనిపోయాయని వాటి యజమానులు వాపోతున్నారు. పులి అడవి దాటి బయటకు రాకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు, పశువుల కాపరులు వేడుకుంటున్నారు.
భయం గుప్పిట్లో బొమ్మలాపురం
బొమ్మలాపురం గ్రామం పెద్దపులి భయంతో వణికి పోతుంది. గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతం సరిహద్దుల్లో ఉన్న గండిచెరువుకు నీరు తాగేందుకు పెద్దపులు వస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తాము పొలాలకు వెళ్లే సమయంలో దారిలో పులి పాదముద్రలను గుర్తించినట్టు చెబుతున్నారు. గత మూడేళ్ళుగా బొమ్మలాపురం పరిసరాల్లోని సంచరిస్తున్న పెద్దపులి తరచూ మేతకు వచ్చిన ఆవులపై దాడులు చేస్తున్నాయని పశువుల కాపర్లు చెబుతున్నారు. పాదముద్రల ఆధారంగా గతంలో ఇక్కడ సంచరించింది ఆడపులని ఫారెస్ట్ అధికారులు అంచనాకు వచ్చారు. దాని కదలికలను గుర్తించేందుకు గతంలోనే చెట్లకు కెమెరాలను కూడా అమర్చారు.

Markapuram Tiger Attack
అయితే కొన్నిసార్లు పులికదలికలు ట్రాప్ కెమెరాలకు చిక్కడం లేదు. తిరిగి ఈ రోజు తాజాగా పెద్దపులి ఇదే ప్రాంతంలో పశువులపై దాడి చేసింది. పులి పాదముద్రలు పొలాలకు వెళ్ళే దారిలో కనిపించడంతో ఆందోళనకు గురైన రైతులు ఫారెస్ట్ అధికారులు సమాచారం అందించారు. పులి అడుగుల జాడలు గుర్తించి రైతులు హడలిపోతున్నారు. ప్రాణభయంతో పొలాలకు వెళ్ళేందుకు వెనకడుగువేస్తున్నారు. పులి ఎక్కువగా రాత్రి సమయాల్లోనే సంచరిస్తుందని.. అటవీప్రాంతంలోని పులి పొలాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
