Pulasa: రికార్డ్ బ్రేక్.. కేజిన్నర పులస వేలంలో ఎంత పలికిందో తెలిస్తే నోరెళ్లబెడతారు
యానాం వద్ద గౌతమి గోదావరిలో మత్స్యకారుడు మల్లాడి ప్రసాద్ వలకు మరోసారి అదృష్టం చిక్కింది. కేజిన్నర బరువున్న పులస అతని వలకు చిక్కింది. దానికి వేలంలో రికార్డు ధర పలికింది. వర్షాలతో గోదావరిలోకి వచ్చే పులసల రాక మత్స్యకారులకు తీపి కబురు తెస్తోంది.

మరో జాలరికి లక్ తగిలింది. అతని వలలో అచ్చమైన పులస పడింది. యానాం ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు మల్లాడి ప్రసాద్ మాత్రం ఏటా ఒకసారి లక్కీగా మారిపోతున్నాడు! ఈసారి కూడా ఆయన వలలో పడిన చేప వేలంలో భారీ రేటు పలికింది. శనివారం యానాం రాజీవ్ బీచ్ వద్ద నిర్వహించిన చేపల వేలంలో.. కేజీన్నర బరువున్న పులస చేప ఏకంగా రూ.22 వేలకు అమ్ముడైంది. పొన్నమండ రత్నం అనే మహిళ ఈ చేపను వేలంలో కొనుగోలు చేశారు. గతేడాది కూడా ఇదే మల్లాడి ప్రసాద్ వలలో పులస చేప పడింది. అప్పుడు అది రూ.23 వేలకు అమ్ముడైంది. ప్రసాద్ అంటే గంగమ్మకు కాస్త ఎక్కువే అంటున్నారు స్థానిక జాలర్లు.
View this post on Instagram
పులస చేపలు సాధారణంగా బంగాళాఖాతం నుంచి గోదావరిలోకి నీటి ప్రవాహానికి ఎదురీదుతూ వస్తాయి. ఇవి జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో మాత్రమే దొరుకుతాయి. వీటికి విపరీతమైన రుచి ఉండటంతో మార్కెట్‌లో వాటికి ఓ రేంజ్ డిమాండ్ ఉంటుంది. పులసలో ఓమేగా ఫ్యాటీ ఆమ్లాలు, అధిక పోషక విలువ ఉండటంతో ఆరోగ్యపరంగా కూడా ఇది విలువైన చేపగా గుర్తింపు పొందింది.
పులస చేపలు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి నదిలోకి ప్రయాణించే సమయంలో మరింత రుచిగా మారతాయి. వీటిలో గుడ్లు ఎక్కువగా ఉన్నపుడు ఇవి మరింత రుచికరంగా ఉండి, ధర కూడా పెరుగుతుంది. ఈ సంవత్సరం గౌతమి గోదావరిలో పడిన మొదటి పులస చేపను కూడా పొన్నమండ రత్నమే కొనుగోలు చేశారు. దాన్ని రూ.15,000కు వేలంలో దక్కించుకున్నారు. వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం పెరగడం వల్ల పులసల రాక మొదలయ్యింది. దీనితో మత్స్యకారుల్లో సంబరాల వాతావరణం నెలకొంది.
ఒక్క పులస దొరికితే చాలు.. వారానికి సరిపడా ఆదాయం వస్తుందని.. గంగమ్మ తమను కూడా కరుణించాలని మిగిలిన జాలర్లు కోరుకుంటున్నారు. కొందరైతే పులస దొరికితే తమకే ఇవ్వాలని మత్స్యకారులకు అడ్వాన్సులు ఇవ్వడం గమనార్హం.
