Andhra Pradesh: గుప్త నిధుల కోసం వేటగాళ్ళు తవ్వకాలు.. శిధిలావస్థలో 500 ఏళ్ళనాటి శివాలయం.. జీవం పోసేందుకు గ్రామస్తుల పోరాటం..
రాయలకాలంలో రతనాల సీమ రాయల సీమ. ఇక్కడ నేటికీ గుప్త నిధుల కోసం వజ్రాల కోసం వేట కొనసాగుతూనే ఉంది. ఇలా గుప్త నిధుల కోసం 500 ఏళ్ల పురాతన ఆలయాన్ని వేటగాళ్ళు తవ్విపోస్తున్నారు. దీంతో తమ గ్రామానికి అలనాటి వైభవాన్ని చాటి చెప్పే గుడిని కాపాడమంటూ గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ అధికారుల నుంచి సీఎం చంద్ర బాబు వరకూ అందరికీ ఆలయ చరిత్రని తెలియజేసి పునఃనిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ పురాతన ఆలయం ఎక్కడ ఉంది? విశిష్ట ఏమిటంటే..

శ్రీ సత్యసాయి జిల్లా గొరవన హళ్లి గ్రామంలో పురాతన శివాలయం ఉంది. జయమంగళి నది తీరంలో ఉన్న ఈ ఆలయం అలనాటి వైభవానికి గుర్తు. దీనిని విజయనగర రాజులు నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఆలయం శిధిలావస్థకు చేరుకుంది. దీనికి ముఖ్య కారణం ప్రభుత్వం ఆలయం అభివృద్ధి వైపు దృష్టి పెట్టకపోవడం ఒకటి అయితే.. మరొకటి గుప్త నిధుల కొడం వేటగాళ్ళు తవ్వకాలు. కను శిధిలావస్థకు చేరుకుంటున్న ఈ గుడిని కాపాడాలని ఆలయాన్ని తిరిగి పునఃనిర్మించాలని ఆ ఊరి ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ ఆలయంలో శివలింగం చాలా ప్రత్యేకం
ఈ ఆలయం బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపూర్ కు పది కిలోమీటర్ల లోపే ఉంటుంది. జయమంగళి నది తీరంలో 16వ శతాబ్దం లో విజయనగర రాజులు ఈ శివాలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అంటే ఈ శివాలయం నిర్మాణం… హిందూపూర్ లో ఉన్న లేపాక్షి ఆలయం నిర్మాణం దాదాపు ఒకేసారి జరినట్లు చెబుతున్నారు. విజయనగర రాజుల పాలన సమయంలో ఈ నదీ తీరంలో ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించే వారని ఆలయ ప్రాంగణం లోని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో శివలింగం చాగంటి గారు చెప్పినట్లు బ్రహ్మ సూత్రంతో ఉంటుందని.. అందుకనే ఈ శివలింగం చాలా అరుదైనది.. ప్రత్యేకమైనదని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాదు ఈ పురాతన శివాలయం విజయనగర రాజుల కాలం నాటి వాస్తు శిల్పకళా సంపదకి నిదర్శనం. నేటికీ ఈ ఆలయంలోని శిల్ప సౌందర్యం, ప్రాంగణం, ప్రాకారాలు, ఉయ్యాల మంటపం వీక్షకులను కట్టిపడేస్తాయి. ఈ శివాలయం పక్కన లక్కమ్మ అనే అమ్మవారి ఆలయం కూడా ఉంది.
శిధిలావస్థలో శివాలయం
కాలక్రమంలో రాజులు పోయారు.. రాజరికాలు పోయాయి.. దీంతో ఈ ఆలయంపై శ్రద్ధ కూడా తగ్గింది. ఓ వైపు జయమంగళి నదీ ప్రవాహం వల్ల ఆలయం కొంత మేర దెబ్బతింది. మరోవైపు గుప్త నిధుల కోసం వేట గాళ్ళ తవ్వకాలు జరుపుకున్తుండడంతో మరింత శిధిలావస్థకు చేరుకుందని చెబుతున్నారు. కొంత మంది దుండగులు నిధుల మీద దురాశతో ఏకంగా శివలింగాన్నే తవ్వే ప్రయత్నం చేశారు. అప్పుడు గ్రామస్తులే శివలింగాన్ని మళ్ళీ ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తున్నారు
గ్రామస్తులు ఈ ఆలయానికి మళ్ళీ జీవం పోయాలని భావిస్తున్నారు. అందుకనే వైశాఖ మాసంలో ఏకాదశ మహా రుద్రాభిషేక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ కు గుడిని పునరుద్దరించాలంటూ విజ్ఞప్తి చేసారు. అంతేకాదు ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చుల్లో కొంత మొత్తం తాము భరిస్తామని కూడా చెప్పారు. మరోవైపు ఈ విషయాన్నీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లారు కూడా. ఏది ఏమైనా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. మరి ఆ శివయ్య తమ కోరికని ఎప్పుడు తీరుస్తాడో అని గ్రామస్తులు అధికారుల వైపు ఆశగా చూస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




