Prakasam district: భర్త బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ తీసుకున్న భార్య.. ఎందుకని ఆరా తీయగా
ఒంటరిగా ఉంటున్నా అని మొర పెట్టుకోవడంతో.. ఆ నేత డెత్ సర్టిఫికెట్ ఇప్పించారు. సిబ్బంది కూడా ఆ నేత ఒత్తిడికి తలొగ్గారు. విషయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో అందరూ విచారణ ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాను బతికుండగానే చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ తీసుకుని పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుందని తన భార్యపై ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో జరిగిన ఈ ఘటనతో సచివాలయ సిబ్బంది ఉలిక్కి పడ్డారు. ఓ రాజకీయ నేత ప్రోద్బలంతో డెత్ సర్టిఫికెట్ ఇచ్చి అడ్డంగా బుక్కయ్యామంటూ నెత్తీనోరుబాదుకుంటున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం వెన్నూరుకు చెందిన నారాయణ, కూచిపూడి గ్రామానికి చెందిన తిరుపాలమ్మలు భార్యాభర్తలు. కుటుంబ కలహాల కారణంగా వీరిద్దరూ 30 ఏళ్ళ క్రితం విడిపోయారు. పదిహేనేళ్ళు భార్యకు దూరంగా ఉన్న నారాయణ.. పదిహేను సంవత్సరాల నుంచి అప్పడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. అయితే గత ముప్పయేళ్లుగా భర్త ఉన్నా, తన బతుకు తాను బతుకుతుంది తిరుపాలమ్మ.
ఈ క్రమంలో ఒంటరి మహిళ పింఛన్ కోసం మర్రిపూడి సచివాలయంలో దరఖాస్తు చేసుకుంది. అయితే అక్కడ భర్త బతికుండగా పింఛన్ రాదని సచివాలయ సిబ్బంది చెప్పడంతో ఆమె ఓ రాజకీయ నేతను ఆశ్రయించింది. జరుగుమల్లికి చెందిన ఆ నాయకుడు ఆమెను నేరుగా జరుగుమల్లి ఎన్‌ఎన్ కండ్రిక సచివాలయానికి తీసుకెళ్ళి తన సిఫార్సుతో ఆమెకు భర్త నారాయణ చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ ఇప్పించాడు. దీంతో విషయం తెలుసుకున్న నారాయణ తాను బతికుండగానే తన భార్య చనిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకుందని, తనకు న్యాయం చేయాలంటూ జరుగుమల్లి పోలీసులను ఆశ్రయించడంతో తిరుపాలమ్మ ప్లాన్ బెడిసికొట్టింది.
వాస్తవానికి నారాయణ తనకు దూరంగా ఉండటంతో 30 ఏళ్ళుగా ఒంటరిగా ఉంటున్న తిరుపాలమ్మ ఆదరువు కోసం పింఛన్ తీసుకోవాలనుకుంది. అయితే అందుకు ఆమె ఎంచుకున్న మార్గమే ఇప్పుడు ఆమెకు తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంలో ఒంటరిగా ఉంటున్న మహిళ తిరుపాలమ్మకు సాయం చేద్దామన్న ఉద్దేశ్యంతో సిఫార్సు చేసి అడ్డంగా ఇరుక్కున్నాడు ఆ రాజకీయ నేత. ఆయనతో పాటు సచివాలయ సిబ్బంది కూడా ఇప్పుడు ఈ వ్యవహారంలో పోలీసు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి