Andhra Pradesh: మహానంది ఆలయంలో ‘చీరల’ పంచాయితీ.. ఈవోతో పూజారుల వాగ్వాదం..
ఓ భక్తుడు సమర్పించిన రెండు చీరలు.. మహానంది ఆలయంలో ఈవో, అర్చకుల మధ్య వివాదానికి దారి తీశాయి. ఈ ఘటనతో పరిచారకుడిగా పని చేస్తున్న వ్యక్తికి ఈవో నోటీసులు జారీ చేశారు. మమ్మల్నే అనుమానిస్తారా అంటూ ఈవో పై అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ భక్తుడు సమర్పించిన రెండు చీరలు.. మహానంది ఆలయంలో ఈవో, అర్చకుల మధ్య వివాదానికి దారి తీశాయి. ఈ ఘటనతో పరిచారకుడిగా పని చేస్తున్న వ్యక్తికి ఈవో నోటీసులు జారీ చేశారు. మమ్మల్నే అనుమానిస్తారా అంటూ ఈవో పై అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో కొత్తగా చీరల వివాదం తెరపైకి వచ్చింది. పదిరోజుల క్రితం రెండు చీరలను అమ్మవారికి సమర్పించాడు ఓ భక్తుడు. ఈ చీరలను అమ్మవారికి కట్టించాలని పరిచారకుడిగా పనిచేస్తున్న సోదరుడికి ఇచ్చాడు ప్రైవేట్ పూజారి. అయితే.. అమ్మవారికి సమర్పించిన చీరలు 10 రోజులుగా ఆలయంలోనే ఉండటంతో ఈవోకు సమాచారం అందింది. చీరలు అనధికారికంగా ఆలయంలో ఉంచడంపై పరిచారకుడికి, పూజారికి ఈవో నోటీసులు జారీ చేశారు. దాంతో.. నోటీసుల వ్యవహారం ఈవో, పూజారుల మధ్య వివాదానికి దారి తీసింది.
అంతేకాదు.. ఆ పరిచారకుడు ప్రైవేట్ పూజారికి సోదరుడు కావడంతో ఇరువురు కలిసి.. అర్చకులనే అవమనిస్తారా అంటూ ఈవో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఈవో, పూజారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆలయ ఈవోపై ఇరువురు కలిసి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. గత రెండు సంవత్సరాల నుంచి ఆలయంలో ఎలాంటి రశీదులు ఇవ్వకుండా పూజలు చేస్తున్నారని, భారీ అవినీతి జరుగుతుందని ఆరోపించారు. పది మంది ఉద్యోగులను కూడా సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే.. చీరలు అమ్మవారికి కట్టకుండా ఉంచిన ఘటన కొత్త వివాదానికి దారి తీసింది. ఈవోపై పూజారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..