Rajampet: టీడీపీ, జనసేన పొత్తుతో రాజంపేటలో మారుతున్న సమీకరణాలు.. త్వరలోనే జనసేనలో మాజీ ఉన్నతాధికారి!

వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయాలు హీటెక్కాయి. తెలుగు దేశం పార్టీలో ఉన్న టిక్కెట్ల కుమ్ములాట వల్ల ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లిపోనుందా..! కేడరే లేని జనసేనకు కొత్త నాయకులు తెరమీదకి రాబోతున్నారా ..? ఆ నియోజకవర్గంలో పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి.

Rajampet: టీడీపీ, జనసేన పొత్తుతో రాజంపేటలో మారుతున్న సమీకరణాలు.. త్వరలోనే జనసేనలో మాజీ ఉన్నతాధికారి!
Tdp And Jana Sena
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 29, 2023 | 6:51 PM

వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయాలు హీటెక్కాయి. తెలుగు దేశం పార్టీలో ఉన్న టిక్కెట్ల కుమ్ములాట వల్ల ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లిపోనుందా..! కేడరే లేని జనసేనకు కొత్త నాయకులు తెరమీదకి రాబోతున్నారా ..? ఆ నియోజకవర్గంలో పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న జనసేన నేతలు ఇప్పుడు కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంపై కన్నేశారు. రాయలసీమలో జనసేనకు ఇచ్చే అతి తక్కువ సీట్లలో రాజంపేట ఒకటిగా కనబడుతుంది. కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఆ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్ధిని పోటీకి సిద్ధం చేయాలని చూస్తుంది జనసేన.

ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంది. రాజంపేటలో ఏ పార్టీ గెలిస్తే, ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది అనేది పార్టీల నమ్మకం. అందుకే రాజంపేటలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈసారి ఇక్కడ తెలుగు దేశం పార్టీ గట్టి నాయకత్వం కోసం ఎదురు చూస్తుంటే, నేతలంతా టికెట్ల కోసం కుమ్ములాటలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి రాజంపేట సీటును జనసేనకు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక జనసేన కూడా రాజంపేట సీటుపై గట్టిపట్టు మీద ఉన్నట్లు సమాచారం. కాపు సామాజిక వర్గం ఓటర్లు ఇక్కడ అధిక సంఖ్యలో ఉండటంతో ఈ సీటును జనసేనకు కేటాయించాలని చర్చలు కూడా జరిగాయట. ఇప్పటివరకు జనసేనకు నాయకులు లేకపోయినా పార్టీని ముందుకు నడిపించేవారు లేకపోయినా సీటు మాత్రం కావాలని జనసేన పట్టుబట్టినట్లు సమాచారం.

అయితే జనసేనకు సీటు వస్తుందనుకున్న తరుణంలో కొంతమంది నేతలు జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారట. టికెట్ ఇస్తే ఖర్చు పెట్టుకుంటామని ఈసారి ఇక్కడ టీడీపీ గానీ, జనసేన గానీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఈ సీటుపై ఇరు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. రాష్ర్టంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరడం, స్థానికంగా టీడీపీలో టికెట్ కోసం కుమ్ములాటలు నెలకొన్న పరిస్ధితుల్లో రాజంపేట సీటు జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ అదిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజంపేటలో జనసేన తరపున పోటీ చేసేందుకు మాజీ డిఆర్‌డిఎ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి యల్లటూరి శ్రీనివాసరాజు బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారట. అందులో భాగంగానే రాజంపేటలో జనసేన తరపున పలు కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు వెళుతున్నారట. త్వరలో అధికారికంగా జనపార్టీలో చేరుతారన్న టాక్ వినిపిస్తోంది.

రాజంపేట టీడీపీలో టిక్కెట్ల కుమ్ములాటలో నాలుగు నుంచి ఐదు మంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చెంగల్ రాయుడుతో పాటు మేడా విజయ శేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రాజు, గంటా నరహరి వీరంతా టీడీపీ రాజంపేట టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతమంది టికెట్ రేసులో ఉన్నారు కాబట్టి వీళ్ళందర్నీ సర్ది చెప్పే కన్నా, ఈ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే మంచిదని టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం. గతంలో 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మేడా మల్లికార్జున్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి, గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

జిల్లాల విభజన సమయంలో రాజంపేట జిల్లా కేంద్రం చేసినందుకు అక్కడ నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. అందులో భాగంగా వైసీపీ ఇక్కడ తప్పకుండా గెలుస్తామని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆలోచనలో భాగంగానే ఈసారి ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టి టీడీపీ గెలవాలని అనుకుంటుంది. ఈ తరుణంలోనే పార్టీలో టికెట్ కుమ్ములాటలు ఎక్కువ అవ్వడంతో, జనసేనకే అప్పచెబితే మంచిదన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక, యల్లటూరు శ్రీనివాసరాజు నందలూరు మండలం పాటూరుకు చెందిన వ్యక్తి కావడంతో సీటుపై ఆశలు పెంచుకుంటున్నారట. ఇంతవరకు జనసేన పార్టీలో డైరెక్ట్‌గా చేరనప్పటికీ, జనసేన నాయకులతో సంబంధాలు మెయింటైన్ చేస్తూ, సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజంపేట సీటును తనకే ఇవ్వాలంటూ శ్రీనివాసరాజు ఇప్పటికే జనసేన నేతలతో సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే రాజంపేట సీటు జనసేనకు కేటాయిస్తారనే సమాచారం రావడంతో, కొందరు కీలక నేతలు సైతం జనసేనలో చేరి ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించే అవకాశాలు కూడా ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఈసారి రాజంపేట సీటును జనసేన అడుగుతుందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులు ఖరారై సీట్లు కూడా కేటాయింపులు జరుగుతున్న నేపథ్యంలో రాజంపేట విషయంలో జనసేన కొంత గట్టిపట్టు మీద ఉన్నట్లు సమాచారం. ఒకవేళ రాజంపేట సీటును జనసేనకు కేటాయిస్తే మొదటి స్థానంలో శ్రీనివాసరాజు ఉండే అవకాశాలైతే కనబడుతున్నాయి. ఒకవేళ టీడీపీనే ఈ స్థానంలో పోటీ చేయాలని అనుకుంటే మాత్రం, ఇప్పటికే టీడీపీ సీటు రేసులో నాలుగు నుంచి ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏది ఏమైనా రాజంపేట సీటును తెలుగు దేశం పార్టీనా, జనసేన అనే విషయం తేల్చాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…