AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు.. ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారంటే.?

రేపు అమరావతి నిర్మాణ పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోదీ రానున్నారు. రోడ్డు షోతో పాటు భారీ బహిరంగ సభలోనూ ప్రధాని మోదీ పాల్గొంటారు. వెలగపూడి సచివాలయం వెనక సభా ప్రాంగణం కాగా.. దానికోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సభకు 29 గ్రామాల ప్రజలు, రైతులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం పంపించారు.

PM Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు.. ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారంటే.?
Pm Modi
Ravi Kiran
|

Updated on: May 01, 2025 | 5:15 PM

Share

ప్రధాని మోదీ అమరావతి టూర్‌ షెడ్యూల్‌ ఖరారైంది. అమరావతి పున: ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఏపీకి వస్తున్నారు. రేపు.. మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు మోదీ. ప్రధానికి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్వాగతం పలుకుతారు. రాజధాని నిర్మాణంలో భాగంగా చేపడుతున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని. మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు చేపడుతోంది. రేపు వాటి ప్రారంభోత్సవాలు కూడా అమరావతి వేదిక మీద నుంచే చేస్తారు ప్రధాని మోదీ. ఓవరాల్‌గా ఒక గంటా 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ సభలో పాల్గొంటారు. షెడ్యూల్‌లోని కార్యక్రమాలన్నీ ముగిసిన తరువాత.. సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు తిరిగి హెలికాఫ్టర్‌లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు.

రాజధాని నిర్మాణంలో భాగంగా 49వేల 40 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రాజెక్టులలో భాగంగా.. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలు ఉన్నాయి. వీటితో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. DRDO, DPIIT, NHAI, రైల్వేస్‌కు సంబంధించి.. దాదాపు 8 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని. నాగాయలంకలో దాదాపు 1,500 కోట్ల రూపాయలతో నిర్మించే మిస్సైల్ టెస్ట్ రేంజ్‌ సెంటర్‌, విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్‌కు శంకుస్థాపన వర్చువల్‌గా ప్రధాని చేతుల మీదుగా జరుగుతుంది. ఇక.. గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన 293 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 3176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా అమరావతి వేదికగానే వర్చువల్ పద్దతిలో శంకుస్థాపనలు జరుగుతాయి.

ఇక.. 3వేల 680 కోట్ల రూపాయల విలువైన పలు నేషనల్ హైవే పనులను సైతం ఇదే వేదిక నుంచి ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. 254 కోట్ల రూపాయలతో నిర్మించిన ఖాజీపేట-విజయవాడ 3వ లైన్, గుంటూరు-గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి, KUF పాణ్యం లైన్లను ప్రధాని ప్రారంభిస్తారు. ఓవరాల్‌గా.. 57వేల 962 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ.