Amalapuram Clashes: కోనసీమ వార్‌లో మరో ట్విస్ట్.. ప్రకంపనలు సృష్టిస్తున్న వార్నింగ్ ‘ఆడియో’..
Amalapuram Clashes: అల్లర్లతో అట్టుడికిన అమలాపురంలో వార్నింగ్ ఆడియో వైరల్ అవుతోంది. మంత్రి విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి పేరుతో సర్క్యులేట్ అవుతోన్న

Amalapuram Clashes: అల్లర్లతో అట్టుడికిన అమలాపురంలో వార్నింగ్ ఆడియో వైరల్ అవుతోంది. మంత్రి విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి పేరుతో సర్క్యులేట్ అవుతోన్న ఆ ఆడియో ఇప్పుడు కోనసీమ అంతటా కలకలం రేపుతోంది. అవును, కోనసీమలో చెలరేగిన మంటలు కొనసాగుతున్నాయ్. అల్లర్లతో అట్టుడికిన అమలాపురంలో విధ్వంసానికి సంబంధించిన ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయ్. కిలోమీటర్ల మేర దారిపొడవున జరిగిన విధ్వంసం ఒక లెక్కయితే, మంత్రి విశ్వరూప్ ఇళ్లు, ఎమ్మెల్యే పొన్నాడ సతీస్ ఇల్లుకు నిప్పు పెట్టడం ఇప్పటికీ సంచలనం రేపుతోంది. మంత్రి విశ్వరూప్‌కి చెందిన రెండిళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టడంపై ఒక ఆడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
మంత్రి విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి పేరుతో సర్క్యులేట్ అవుతోన్న ఈ ఆడియోలో ఈదరపల్లి వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబును బెదిరిస్తున్న వార్నింగ్ ఉంది. ‘‘నీ రెండూ కాళ్లూ విరిచేస్తా.. నీ అంతు చూస్తా.. జిల్లా మీద నీకు అంత ప్రేముంటే.. మీ ఇళ్లు తగలబెట్టుకోవాల్సింది.. లేదంటే నువ్వే తగలబెట్టుకోవాల్సింది.. అంతేగాని, మా ఇంటికి నిప్పంటించడానికి నీకెంత ధైర్యం’’ అంటూ వార్నింగ్ అందులో ఉంది. మంత్రి విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి పేరుతో ఈ ఆడియో వైరల్ అవుతోంది.




ఈదరపల్లి వైసీపీ ఎంపీటీసీకి వార్నింగ్ ఇచ్చింది మంత్రి విశ్వరూప్ కొడుకో కాదో తేల్చాల్సింది పోలీసులే అయినా, అమలాపురం అల్లర్లతో తనకెలాంటి సంబంధం లేదంటున్నాడు అడపా సత్తిబాబు. వైసీపీలో మరో వర్గం తనను ఇరికిస్తోందని వాపోతున్నాడు. అయితే, వైరల్ అవుతోన్న ఈ ఆడియోపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇది నిజంగానే మంత్రి కుమారుడు మాట్లాడిన ఆడియోనా.. లేక ఫేక్ వాయిస్సా అనేది తేల్చడంపై ఫోకస్ పెట్టారు. అయితే, అమలాపురంలో అల్లర్లు జరిగిన మరుసటి రోజే ఎంపీటీసీ సత్తిబాబుకు ఫోన్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. అప్పుడు ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో ఆలస్యంగా సోషల్ మీడియాలోకి వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్ అమలాపురంలో.




