Yanam: యానాంను చుట్టుముట్టిన వరద.. నడుం లోతు నీళ్లల్లో బిక్కుబిక్కుమంటూ బాధితులు
వర్షాలు తగ్గుముఖం పట్టి, వరద ఉద్ధృతి తగ్గుతున్నా.. యానాం (Yanam) లో మాత్రం పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో గౌతమీ పాయ కారణంగా వరద నీరు...
వర్షాలు తగ్గుముఖం పట్టి, వరద ఉద్ధృతి తగ్గుతున్నా.. యానాం (Yanam) లో మాత్రం పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో గౌతమీ పాయ కారణంగా వరద నీరు పోటెత్తింది. అంతే కాకుండా ధవళేశ్వరం బ్యారేజీ (Dhawaleshwaram Barrage) నుంచి 25 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడంతో నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా గోదావరికి (Godavari) చేరువలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. పలు కాలనీల్లో నడుములోతు నీరు చేరింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఇల్లు వదిలి బయటకు వస్తే సామగ్రి దొంగల పాలవుతుందని భయపడి, సురక్షిత ప్రాంతానికి వెళ్లడం లేదు. కష్టమైనా అక్కడే ఉంటున్నారు. యానాం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉదయం భోజనం అందిస్తున్నారు. వరద ప్రభావం మరో మూడు రోజులపాటు కొనసాగే పరిస్థితి ఉందన్న హెచ్చరికలు స్థానికులను కునుకు లేకుండా చేస్తున్నాయి.
ప్రజల ఇబ్బందులను పుదుచ్చేరి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు ముఖ్యమంత్రి రంగస్వామి వివరించారు. తక్షణ సాయంగా ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబానికి రూ.5 వేలు అందించాలని కోరారు. వరద ముంపునకు గురైన కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాధితులకు ఆహారం, తాగునీరు, కొవ్వొత్తులను స్థానికంగా ఉన్న నేతలు అందిస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. మరోవైపు.. వరద ప్రభావిత మండలాలలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి జోగి రమేష్, హోం మంత్రి తానేటి వనిత, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌లు పర్యటించారు. అమలాపురంలో వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అయ్యన్న నగర్ దగ్గర గోదావరి గట్టుకు గండిపడటంతో యానాం జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఆడపడుచుల కాలనీ, వైఎస్సార్ నగర్, ఫరం పేటలో ఇళ్లు నీటమునిగాయి. కేవలం 30 నిముషాల్లోనే అబ్దుల్‌కలామ్ నగర్, అయ్యన్ననగర్, సుభద్రనగర్ రాధానగర్ పల్లపు ప్రాంతాల్లోకి నడుము లోతు నీళ్లు వచ్చాయి. అయ్యన్ననగర్ వద్ద ఉన్న స్లూయిజ్ ద్వారా వరద నీరు నీలపల్లి ప్రాంతాలకు వెళుతుండడంతో స్లూయిజ్ మూసివేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..