AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం రైతన్నా.. పంట అమ్మిన సొమ్మంతా ఇలా పోయింది ఏంటి..?

పల్నాడు జిల్లాలో ఓ రైతు సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. పంట అమ్మగా వచ్చిన డబ్బులను రెండు బ్యాంకు ఖాతాల్లో దాచుకోగా.. వాట్సాప్‌కు వచ్చిన లింక్‌ ఓపెన్‌ చేయడంతో ఫోన్‌ హ్యాక్‌ అయింది. దీంతో రెండు ఖాతాల నుంచి ఏకంగా రూ.16.82 లక్షలు మాయమయ్యాయి.

పాపం రైతన్నా.. పంట అమ్మిన సొమ్మంతా ఇలా పోయింది ఏంటి..?
Koteswararao
T Nagaraju
| Edited By: |

Updated on: Oct 30, 2026 | 1:38 PM

Share

ఆరుగాలం కష్టపడి పంట పండించి విక్రయించిన సొమ్మును బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న ఓ రైతు సైబర్‌ నేరగాళ్ల బారినపడ్డాడు. వాట్సాప్‌కు వచ్చిన లింక్‌ను ఓపెన్‌ చేయడంతో ఫోన్‌ హ్యాక్‌ చేసి, రెండు బ్యాంకు ఖాతాల్లోని రూ.16,82,875ను కాజేశారు. పల్నాడు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బోనం కోటేశ్వరరావు ఇటీవల తన పొలంలో పండించిన మిర్చి, కందులు, పత్తిని విక్రయించాడు. పంట అమ్మగా వచ్చిన డబ్బులను చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకుల్లోని తన ఖాతాల్లో జమ చేసుకున్నాడు.

రైతు ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు ఉన్న విషయాన్ని గుర్తించిన సైబర్‌ నేరగాళ్లు.. అతడి ఫోన్‌ నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఓ లింక్‌ పంపించారు. దాన్ని కోటేశ్వరరావు ఓపెన్‌ చేయడంతో ఫోన్‌ హ్యాక్‌ అయినట్లు తెలుస్తోంది. అనంతరం బ్యాంకుల నుంచి వచ్చే లావాదేవీల మెసేజ్‌లు రైతుకు అందకుండా ఫోన్‌లో మార్పులు చేశారు. ఆ తర్వాత అనుమానం రాకుండా చిన్నచిన్న మొత్తాల్లో డబ్బులను విత్‌డ్రా చేస్తూ వచ్చారు.

ఈ విధంగా రెండు ఖాతాల నుంచి మొత్తం రూ.16,82,875 కాజేశారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి కూడా మిగలకుండా చేయగా.. యూనియన్‌ బ్యాంకు ఖాతాలో కేవలం రూ.450 మాత్రమే ఉంచారు.

కొన్ని రోజుల తర్వాత ఖాతాల్లో నగదు లేకపోవడాన్ని గుర్తించిన కోటేశ్వరరావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే స్థానికులకు విషయం చెప్పగా, వారి సూచన మేరకు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు అధికారులు ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

కష్టపడి పండించిన పంటను అమ్మగా వచ్చిన డబ్బులు సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం చేసి, పోగొట్టుకున్న సొమ్మును తిరిగి ఇప్పించాలని బ్యాంకు అధికారులు, పోలీసులను కోరుతున్నాడు.

Follow Us