Telugu Proverb: అడుసు తొక్కనేల కాలు కడగనేల..ఈ సామెత అర్థం తెలుసా?
Telugu Proverb Meaning: తెలుగు సామెతల్లో లోతైన అర్థం, గొప్ప సందేశం ఉంటుంది. అందుకే ఎన్నో సామెతలు మన తాత ముత్తాతల కాలం నుంచి వాడుకలో ఉన్నాయి. అలాంటి సామెతల్లో ‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’ అనే సామెత ఒకటి. ఈ సామెతకు అర్థం తెలుసా? ఈ సామెతను ఎప్పుడు వాడుతారు? ఇది జీవితానికి అందించే నీతి ఏమిటో తెలుసుకుందాం.

తెలుగు భాషలో సామెతలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ఎన్నో సామెతలు తరతరాలుగా వాడుకలో ఉన్నాయి. మన పెద్దలు వారి జీవిత అనుభవాలను సామెతల రూపంలో మనకు అందించారు. ఒక్కో సామెత వెనుక ఎంతో లోతైన అర్థం, జీవితానికి ఉపయోగపడే నీతి దాగి ఉంటుంది. ఒక గొప్ప సందేశాన్ని కూడా చిన్న పదాలతో కూడిన ఓ సామెతతో ఎదుటి వారికి అర్థమయ్యేలా వివరించొచ్చు. అలాంటి అర్థవంతమైన సామెతల్లో ఒకటి ‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’. ఇంతకీ ఈ సామెతకు అర్థం ఏమిటి? ఎలాంటి సందర్భాల్లో ఈ సామెతను ఉపయోగిస్తారో తెలుసుకుందాం.
సామెత అర్థం ఏంటి?
ముందుగా ఈ సామెతలోని ‘అడుసు’ అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. అడుసు అంటే బురద. సాధారణంగా బురదలో కాలు పెడితే కాళ్లు మురికిగా అవుతాయి. ఆ తర్వాత వాటిని శుభ్రం చేసుకోవడానికి నీళ్లతో కడుక్కోవాల్సి వస్తుంది. బురదలో కాలు పెట్టకపోతే శ్రమపడి కడుక్కోవాల్సిన అవసరమే ఉండదు. ఈ చిన్న విషయాన్ని తీసుకుని మన పెద్దలు ఈ సామెతను రూపొందించారు. తెలిసి తప్పు చేయడం ఎందుకు? ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇబ్బందులు పడటం ఎందుకు? అన్నది ఈ సామెతకు ప్రధాన అర్థం. అంటే మనకు ఏదైనా పని వల్ల సమస్యలు వస్తాయని ముందే తెలిసినప్పుడు, అలాంటి పనులకు దూరంగా ఉంటే మంచిది. తెలిసి తెలిసి సమస్యల్లో చిక్కుకుని ఆ తర్వాత బాధపడటం, వాటి నుంచి బయటపడేందుకు కష్టపడటం అవివేకం అవుతుంది. సమస్యల్లో చిక్కుకోకుండా ముందుచూపుతో వ్యవహరించాలని ఈ సామెత సూచిస్తుంది.
ఈ సామెతను ఎప్పుడు ఉపయోగిస్తారు?
ఈ సామెతను రోజువారీ జీవితంలో అనేక సందర్భాల్లో ఉపయోగించొచ్చు. ఒక వ్యక్తి తన చర్య వల్ల ఇబ్బందులు వస్తాయని తెలిసినా అదే పని చేసి, ఆ తర్వాత తాను చేసిన పనికి బాధపడితే ఈ సామెతను ఉపయోగిస్తారు. అనవసరంగా ఇతరుల గొడవల్లో తలదూర్చి సమస్యలు కొని తెచ్చుకున్నప్పుడు కూడా ఈ సామెతను గుర్తుచేస్తారు. భవిష్యత్తులో నష్టం జరుగుతుందని తెలిసినా ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకుని ఇబ్బందులు పడితే ఈ మాట వర్తిస్తుంది.
ఈ సామెత మనకు నేర్పే నీతి ఏమిటి?
జీవితంలో ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. మనం చేసే పనుల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ముందుగానే అంచనా వేయాలి. అనవసరమైన గొడవలు, వివాదాలు, తప్పుడు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. సమస్య వచ్చిన తర్వాత బాధపడటం కంటే, సమస్య రాకుండా ముందే జాగ్రత్తపడటం ఎంతో మంచిదని ‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’ అనే తెలుగు సామెత సందేశం ఇస్తుంది.




