IRCTC: రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన.. 12 రోజుల రైలు యాత్ర వివరాలివే!
IRCTC Tour Package 2027 Telugu:రెండు జ్యోతిర్లింగాలతో పాటు తిరుమల, శ్రీకాళహస్తి, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు IRCTC ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడపనుంది. జనవరి 2027లో ప్రారంభమయ్యే ఈ 12 రోజుల యాత్ర టికెట్ ధరలు, ప్రయాణ వివరాలు, ప్యాకేజీలో లభించే సదుపాయాలు తెలుసుకోండి.

IRCTC Tour Package 2027 Telugu: ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో సందర్శించాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మంచి అవకాశం కల్పిస్తోంది. ’02 జ్యోతిర్లింగ విత్ దక్షిణ దర్శన్ యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడపనుంది. ఈ ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా తిరుమల, శ్రీకాళహస్తి, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, శ్రీశైలం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించవచ్చు.
జనవరి 3 నుంచి యాత్ర ప్రారంభం
ఈ ప్యాకేజీ మొత్తం 11 రాత్రులు, 12 రోజుల పాటు కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లోని రేవా రైల్వే స్టేషన్ నుంచి 2027 జనవరి 3న యాత్ర ప్రారంభమవుతుంది. సత్నా, మైహర్, కట్నీ, జబల్‌పూర్, నర్సింగ్‌పూర్, ఇటార్సీ, బేతుల్, నాగ్‌పూర్ స్టేషన్లలో ప్రయాణికులు రైలు ఎక్కవచ్చు. జనవరి 14న తిరిగి రేవాకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
సందర్శించే పుణ్యక్షేత్రాలు ఇవే
ఈ యాత్రలో మొదట తిరుపతికి చేరుకుంటారు. అక్కడ శ్రీవారి దర్శనంతో పాటు శ్రీకాళహస్తి ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించవచ్చు. అనంతరం రామేశ్వరం చేరుకుని ప్రసిద్ధ రామనాథస్వామి ఆలయంలో దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు.
తదుపరి కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, కన్యాకుమారి అమ్మవారి ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. సూర్యాస్తమయాన్ని కూడా వీక్షించవచ్చు. చివరగా మార్కాపురం లేదా కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని శ్రీశైలంలోని మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. అనంతరం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
టికెట్ ధరలు ఎంతంటే?
ప్రయాణికుల సౌకర్యార్థం మూడు కేటగిరీల్లో ప్యాకేజీ అందుబాటులో ఉంది.
- ఎకానమీ (స్లీపర్ క్లాస్): రూ.22,450
- స్టాండర్డ్ (3AC): రూ.37,250
- కంఫర్ట్ (2AC): రూ.49,250
ఈ ధరల్లో జీఎస్టీ కలిపి ఉంటుంది. భారత్ గౌరవ్ రైలు పథకం కింద భారతీయ రైల్వే సుమారు 33 శాతం రాయితీని అందిస్తోంది.
ప్యాకేజీలో ఎలాంటి సదుపాయాలు ఉంటాయి?
రైలు ప్రయాణంతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. ఎంపిక చేసుకున్న తరగతిని బట్టి నాన్ ఏసీ లేదా ఏసీ హోటళ్లలో బస ఏర్పాటు చేస్తారు. ఆలయాల సందర్శనకు రవాణా సౌకర్యం, టూర్ ఎస్కార్ట్, రైలులో భద్రతా సిబ్బంది, రోజుకు రెండు లీటర్ల వాటర్ బాటిల్, ప్రయాణ బీమా కూడా ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.
అయితే ప్రత్యేక దర్శనం టికెట్లు, గైడ్ సేవలు, ఆలయాల ప్రవేశ రుసుములు, వ్యక్తిగత ఖర్చులు, పోర్టర్, ఇతర అదనపు సేవలకు అయ్యే ఖర్చులను ప్రయాణికులే భరించాలి. తిరుమల శ్రీవారి దర్శన ఏర్పాట్లలో IRCTCకి ఎలాంటి బాధ్యత ఉండదని గుర్తుంచుకోవాలి.
టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?
ఈ యాత్రకు సంబంధించిన టికెట్లను IRCTC అధికారిక వెబ్‌సైట్ [www.irctctourism.com] ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుని మీకు అనువైన తరగతిని ఎంచుకుని యాత్రకు సిద్ధం కావచ్చు.
రెండు జ్యోతిర్లింగ విత్ దక్షిణ దర్శన్ యాత్ర టికెట్ బుకింగ్, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేసింది.




