Andhra News: సమస్య నావల్ల అయినా వెనకాడ వద్దు.. ఫిర్యాదు చేయండి.. ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం!
ప్రజాప్రతినిధి అంటే నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజల సమస్యలు తెలుకునేవాడు. అలాంటి నాయకుడికి ఉండే ప్రజాధరణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కల్లేదు. ఇలాంటి నాయకుల్లొ ఒకరైన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు వారి ప్రతి సమస్యను చెప్పుకునేందుకు వీలుగా పోస్ట్‌బాక్స్‌ల తరహాలో నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో ప్రజావాణి బాక్స్‌లను ఏర్పాటు చేశారు.

శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలు ఉంటాయని, వాటిల్లో ఇదీ ఒకటి అంటున్నారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి సుపరిపాలనలో తొలిఅడుగు పేరుతో ఒంగోలు నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు ప్రజల నుంచి వివిధ రకాల ఫిర్యాదులు అందుతున్నాయి. కొంతమంది బాధితులు తమ సమస్యలను నలుగురిలో చెప్పలేకపోతున్నట్టు గుర్తించారు. వీటిలో పర్సనల్ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో జరుగుతున్న ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు వంటి సమస్యలతో పాటు అధికారుల అవినీతి అంశాలు కూడా ఉంటున్నట్టు గుర్తించారు.

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల ఇళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న మందీ మార్బలాన్ని చూసి ప్రజలు నేరుగా తనకు సమస్యలు చెప్పలే కపోతున్నట్టు ఒంగోలు ఎమ్మెల్యే జనార్ధన్ గుర్తించారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచించారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారి ఒంగోలు నగరంలో ప్రధాన కూడళ్ళల్లో పోస్ట్ బాక్స్‌ల తరహాలో ప్రజావాణి బాక్స్‌ల పేరుతో ప్రజా ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేశారు. చూడటానికి ఉత్తరాలు వేసే పోస్ట్‌బాక్స్‌లా కనిపిస్తున్న ఈ ప్రజావాణి బాక్స్‌లో.. బాధితులు తమ సమస్యలను వివరిస్తూ ఊరు, పేరు, ప్రాంతం వంటి వివరాలతో కూడిన చిరునామా, సెల్‌ఫోన్ నెంబర్‌ను రాయాలని సూచించారు.

ఇలా వచ్చే ఫిర్యాదులను ప్రజావాణి బాక్స్‌లను నుంచి సేకరించి 48 గంటల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే జనార్ధన్ హామీ ఇస్తున్నారు. అలాగే ఫిర్యాదులు చేసే వారి వివరాలను ఇతరులకు తెలియకుండా గోప్యంగా ఉంచుతామని, దీని వల్ల తాము ఎవరిపై అయితే ఫిర్యాదు చేస్తున్నారో వారినుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు వీలవుతుందని తెలిపారు. నేరుగా తనను కలిసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో ఈ ప్రజావాణి బాక్స్‌లలో తమ సమస్యలతో కూడిన ఫిర్యాదులను వేస్తే.. వెంటనే స్పందించి బాధితులను తమ టీం మెంబర్లు సంప్రదిస్తారని చెబుతున్నారు. ఒకవేళ తన వల్ల కానీ, తన సిబ్బంది వల్ల కానీ ఇబ్బందులు ఎదురవుతున్నా నిర్భయంగా తెలపాలని ఎమ్మెల్యే కోరారు. ఇలాంటి ఫిర్యాదుల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్యలు పరిష్కరించేందుకు వీలవుతుందని, ఈ సౌకర్యాన్ని ఒంగోలు ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే జనార్ధన్ కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
