AOB: ఏఓబీలో మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ.. కీలక నేత దుబాసి శంకర్ అరెస్ట్..
ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్లు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి ఆంధ్రా, ఒడిశా బర్డర్(ఏఓబీ)లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏఓబీలో కీలక నేత దుబాసి శంకర్‌తో పాటు మావోయిస్టు పార్టీ గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు కిరణ్‌ను పోలీసు బలగాలు అరెస్ట్ చేశాయి...
ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్లు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి ఆంధ్రా, ఒడిశా బర్డర్(ఏఓబీ)లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏఓబీలో కీలక నేత దుబాసి శంకర్‌తో పాటు మావోయిస్టు పార్టీ గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు కిరణ్‌ను పోలీసు బలగాలు మంగళవారం ఒడిశాలోని బైబర్ కూడా అటవీ ప్రాంతంలో అరెస్టు చేశాయి. రెండు రోజుల నుంచి ఈ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు జరుగుతుండగా మంగళవారం ఒడిశాలోని పోలీసు బలగాలు, మావోయిస్టు పార్టీకి ఎదురు కాల్పుల ఘటన జరిగాయి. కాల్పుల అనంతరం గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులకు మావోయిస్టు కీలక నేత దుబాసి శంకర్ చిక్కాడు. అతని నుంచి పది రౌండ్ల బుల్లెట్లు, ఇన్ఫాస్ రైఫిల్, కొంత మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.
శంకర్‌పై ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 50 వరకు కేసులు ఉండగా అనేక విధ్వంసకర సంఘటనల్లో అతను పాల్గొన్నారు. అతని పేరిట రూ.20 లక్షల రివార్డు కూడా ఒడిశా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ప్రస్తుతం ఆయన ఆంధ్ర ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో సీనియర్ నేతగానూ గుర్తింపు ఉంది. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా చెట్ల నర్సింపల్లి గ్రామానికి చెందినవారు. 1987లో మావోయిస్టు పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 2013లో ఏఓబీకి బదిలీపై వచ్చి అప్పటి నుంచి కీలక నేతగా మావోయిస్టు ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
అలాగే చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన మాధవ్ సోనాలి అలియాస్ కిరణ్ పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడిగానూ, గుమ్మ బ్లాక్‌లోని సభ్యుడిగానూ పని చేస్తున్నారు. అతనిని కూడా ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాలతో మావోయిస్టు పార్టీకి ఏఓబీలో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఏఓబీ వ్యాప్తంగా మావోయిస్టుల కార్యకలాపాలు నిరోధించేందుకు ఆంధ్ర, ఒడిశా పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఆరెస్టు అయిన దుబాసి శంకర్, కిరణ్ నుంచి ఒడిశా పోలీసాధికారులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు మండల కేంద్రాలతో పాటు అన్ని అవుట్ పోస్ట్‌ల పరిధిలో పోలీసు బలగాలు తనిఖీలను ముమ్మరం చేశాయి.
మరోవైపు ప్రముఖ మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే మృతితో ఏవోబీలో మావోలకు కోలుకోలేని దెబ్బగిలినట్లేనని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో ఇక మిగిలింది చలపతి, ఉదయ్లేనని పోలీసులు అంటున్నారు.1995 నుంచి మావోయిస్ట్‌ల అడ్డాగా ఏఓబీ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, 2004 నుంచి ఆర్‌కే నేతృత్వంలో ఏఓబీ మావోల కంచుకోటగా మారింది. ఆర్‌కే హయాంలోనే 2008 లో బలిమెలలో మావోల మెరుపు దాడి చేసి 36 మంది పోలీసుల మృతికి కారకులయ్యారు.
Read Also.. Maoist Leader RK: ఆర్‌కె మృతితో ఏవోబీలో మావోయిస్ట్ ఉద్యమం దాదాపు ముగిసినట్లే: పోలీస్ వర్గాలు