Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoist Leader RK: ఆర్‌కె మృతితో ఏవోబీలో మావోయిస్ట్ ఉద్యమం దాదాపు ముగిసినట్లే: పోలీస్ వర్గాలు

ప్రముఖ మావోయిస్టు అగ్రనేత ఆర్‌కె మృతితో ఏవోబీలో మావోలకు కోలుకోలేని దెబ్బగిలినట్లేనని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో ఇక మిగిలింది చలపతి, ఉదయ్ లే నని పోలీసులు

Maoist Leader RK: ఆర్‌కె మృతితో ఏవోబీలో మావోయిస్ట్ ఉద్యమం దాదాపు ముగిసినట్లే: పోలీస్ వర్గాలు
RK
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 15, 2021 | 2:58 PM

Maoist Leader RK: ప్రముఖ మావోయిస్టు అగ్రనేత ఆర్‌కె మృతితో ఏవోబీలో మావోలకు కోలుకోలేని దెబ్బగిలినట్లేనని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో ఇక మిగిలింది చలపతి, ఉదయ్ లే నని పోలీసులు అంటున్నారు. అయితే, ఆర్ కె మృతి తో ఒకరకంగా ఏవోబీలో మావోయిస్ట్ ఉద్యమం దాదాపు ముగిసినట్లేనని పోలీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కాగా, 1995 నుంచి మావోయిస్ట్‌ల అడ్డాగా ఏఓబీ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, 2004 నుంచి ఆర్‌కె నేతృత్వంలో ఏఓబీ మావోల కంచుకోటగా మారింది. ఆర్‌కె హయాంలోనే 2008 లో బలిమెలలో మావోల మెరుపు దాడి చేసి 36 మంది పోలీస్‌ల మృతికి కారకులయ్యారు.

ఇక, ఏవోబీ బాధ్యతల నుంచి ఆర్ కె వైదొలిగాక 2017 ఓడిశాలోని రామగూడ అటవీ ప్రాంతంలో మావోల ప్లీనరీ పై పోలీస్‌లు దాడి చేశారు. ఈ ఘటనలో ఏకంగా 32 మంది మావోలు మరణించారు. అప్పటి నుంచి ఇన్ఫార్మర్ల వ్యవస్థను మెరుగుపరచుకున్నారు పోలీస్‌లు. ఇటీవల కాలంలో ఏఓబీ పరిసరాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీస్‌లు ఆ పట్టుతోనే ఆపరేషన్ సమాధాన్ ని సక్సెస్ చేశాయి సాయుధ దళాలు.

ఇలా ఉండగా, “కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ (63) అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021 ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడు. కామ్రేడ్ హరగోపాల్‌కు అకస్మాతుగా కిడ్నీల సమస్య మొదలైంది. వెంటనే డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడైనాడు. ఆయనకు పార్టీ మంచి వైద్యం అందించినప్పటికీ దక్కించుకోలేకపోయింది. ఆయనకు విప్లవ శ్రేణుల మధ్యనే అంత్యక్రియలు నిర్వహించి శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది. కామ్రేడ్ రామకృష్ణ అమరత్వం పార్టీకి తీరని లోటు.

కామ్రేడ్ హరగోపాల్ 1958 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని పల్నాడ్ ప్రాంతంలో జన్మించాడు. తండ్రి ఒక స్కూల్ టీచర్. కామ్రేడ్ హరగోపాల్ పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యనభ్యసించారు. కొంత కాలం తండ్రితో పాటు టీచర్‌గా పని చేశాడు. 1978లో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షించబడి భాకపా (మాలె) (పీపుల్స్ వార్) లో పార్టీ సభ్యత్వం తీసుకొన్నాడు. 1980లో గుంటూర్ జిల్లా పార్టీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. 1982 పార్టీలోకి పూర్తికాలం కార్యకర్తగా వచ్చాడు. గుంటూరు పల్నాడ్ ప్రాంతంలో గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించాడు. ఆ క్రమంలో విప్లవోద్యమ నాయకత్వంగా ఎదిగి 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎదిగాడు. 1992 లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైనాడు. తరువాత దక్షిణ తెలంగాణ ఉద్యమానికి 4 సంవత్సరాలు నాయకత్వం అందించాడు. 2000 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడంతో పాటు, 2001 లో జనవరిలో జరిగిన పీపుల్స్ వార్ 9వ కాంగ్రెసులో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆర్కే.

2004 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ మధ్యలో జరిగిన చర్చల్లో పార్టీ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించాడు. ప్రభుత్వం ముందు ప్రజల డిమాండ్లను పెట్టి తన ప్రతినిధుల బృందంతో పాటు సమర్ధవంతంగా చర్చించారు. ఈ చర్చల ప్రక్రియలో పార్టీ రాజకీయ దృక్పథాన్ని రాష్ట్ర, దేశ ప్రజల్లోకి వ్యాప్తి చేసాడు. ప్రభుత్వం చర్చల నుండి వైదొలిగి తీవ్ర నిర్బంధం ప్రయోగించి కామ్రేడ్ రామకృష్ణను హత్య చేయడానికి ప్రయత్నాలు చేయడం ప్రారంభించగానే, ఆయన్ని ఏఓబీ ఏరియాకు కేంద్రకమిటీ బదిలీ చేసి, ఏఓబీ బాధ్యతలు ఇచ్చింది. ఆయన 2014 వరకు ఏవోబీ కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఏవోపీని కేంద్రకమిటీ నుండి గైడ్ చేసే బాధ్యత నిర్వహిస్తున్నాడు. 2018లో ఆయన్ని కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో నియమించింది. ప్రస్తుతం ఏఓబీలో ప్రభుత్వం కొనసాగిస్తున్న అత్యంత నిర్బంధ కాండలో పార్టీనీ, కేరర్లను రక్షించే కార్యక్రమాన్ని ఎంతో దృఢంగా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్య సమస్య తలెత్తి అమరుడయ్యారు.

కామ్రేడ్ హరగోపాలకు విప్లవోద్యమంలోనే కామ్రేడ్ శిరీషతో వివాహం జరిగింది. వారికి ఒక మగ పిల్లవాడు జన్మించాడు. కామ్రేడ్ మున్నా (పృధ్వి) కూడా విప్లవోద్యమంలో తండ్రి బాటనే నడిచి 2018లో జరిగిన రామగూడ ఎన్ కౌంటర్ లో అమరుడైనాడు. కామ్రేడ్ హరగోపాల్ విప్లవోద్యమంలో స్థిరచిత్తంతో పాల్గొన్నాడు. ఆయన మొక్కవోని ధైర్యసాహసాలతో పార్టీకి, విప్లవోద్యమానికి నాయకత్వం అందించాడు. పార్టీ రాజకీయ డాక్యుమెంట్సను రూపొందించడంలో చురుకుగా చర్చలు చేసేవాడు. ప్రజలతో నిత్య సంబంధంలో ఉంటూ, పార్టీకి అన్ని రంగాల్లో సేవలందించారు.

విప్లవోద్యమానికి నిస్వార్థంగా సేవలందిస్తూ, అహర్నిషలు కృషి చేసాడు. ఆయన విప్లవోద్యమంలో ప్రదర్శించిన అకుంఠిత దీక్ష, శైలి, సాధారణ జీవితం , ప్రజల పట్ల ప్రేమ, కామ్రేడ్స్ తో అప్యాయతలు, శత్రువు పట్ల కసి, విప్లవ గమనంపై స్పష్టత, దూరదృష్టి నుండి యావత్తు పార్టీ, కేడర్లు, విప్లవ ప్రజానీకం ప్రేరణ పొంది, ఆయన ఆశయాన్ని తుది కంటా కొనసాగించి… దేశంలో ప్రజాస్వామిక విప్లవాన్ని పరిపూర్తి చేయడానికి మరోమారు ప్రతిజ్ఞ చేద్దాం” అంటూ పార్టీ కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది.

Read also: సుగంధ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్.. రైతాంగానికి మంత్రి నిరంజన్‌రెడ్డి సూచన