RUIA Incident: రుయా ఘటనపై వివరణ కోరిన జాతీయ మానవహక్కుల సంఘం.. 4 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి రోగులు మృతి చెందిన ఘటనపై 4 వారాల్లోపు వివరణ ఇవ్వాలని జాతీయ మానవహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి రోగులు మృతి చెందిన ఘటనపై 4 వారాల్లోపు వివరణ ఇవ్వాలని జాతీయ మానవహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి 30 మంది చనిపోయారని తిరుపతి మాజీ ఎంపీ సి.హెచ్ మోహన్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో 11 మంది చనిపోయారని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లిబర్టిస్ సోషల్ జస్టిస్ సంస్థ ప్రతినిధి జెష్టాది సుధాకర్ కూడా ఫిర్యాదు చేశారు. ఇలా వచ్చిన వేర్వేరు ఫిర్యాదులపై స్పందించిన ఎన్.హెచ్.ఆర్.సి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదుల్లోని అంశాలు వాస్తవమైతే అది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని జాతీయ మానవహక్కుల సంఘం ( ఎన్. హెచ్.ఆర్.సి. ) పేర్కొంది.
అసలు ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడి 11 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలిసిందే. చెన్నై నుంచి రావాల్సిన ట్యాంకర్ ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో ఈ ఘోరం జరిగింది. అయితే.. వెంటిలేటర్‌పై ఉన్న బాధితులు మాత్రమే చనిపోగా మిగతావారు సిబ్బంది, బంధువుల సాయంతో బయటపడ్డారు.
రుయా మృతులకు రూ.10లక్షల పరిహారం..
విషాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్.. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఆక్సిజన్ అందక చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.