New Pensions in AP: ఏపీలో కొత్త పింఛన్లు వచ్చేస్తున్నాయ్.. ఎప్పటి నుంచి అంటే..?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద కొత్తగా మరో 93 వేల మంది వితంతువులకు పింఛన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేయనుంది. ఈ ఏడాది మే నెల నుంచి ఈ కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు..

అమరావతి, మార్చి 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం మరో సరికొత్త రికార్డుకు సిద్ధమవుతుంది. కొత్తగా మరో 93 వేల మంది వితంతువులకు పింఛన్లు జారీ చేయనుంది. ఈ ఏడాది మే నెల నుంచి వీరందరికీ కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా గంట్యాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇంతకీ ఏం చెప్పారంటే..
రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులుగా గుర్తించామన్నారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన అన్నారు. అలాగే ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు డ్రావ్వా సంఘాలను కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి, దాన్ని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పేదరిక నిర్మూలనకు దాతల సాయం తీసుకుంటున్నామన్నారు. అంటే నిరుపేద కుటుంబాలను ఆయా దాతలకు అప్పగించి, వారి ద్వారా మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా పేదలకు మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా ఇటీవల అసెంబ్లీలో పింఛన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 50 ఏళ్లు నిండినవారికి పింఛన్ పథకం అమలు చేస్తామని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం చెప్పారు. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు కూడా జరిపినట్లు తెలియజేశారు. ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు, ఆదివాసీ గిరిజనులు, సాంప్రదాయ చర్మకారులకు ఇప్పటికే పింఛన్లు ఇస్తున్నామని గుర్తు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.