AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP Politics: ఆ విషయంలో ఆయనదే తుది నిర్ణయం.. జగన్‌కు సారీ చెప్పిన పిల్లి సుభాష్ చంద్రబోస్..

MP Pilli Subhash Chandra Bose: కాకినాడ జిల్లా రామచంద్రాపురం రాజకీయం ఏపీలో రసకందాయంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే.. అధికార పార్టీలో వర్గపోరు ఊహించని స్థాయికి చేరుకొన్న తరువాత మంత్రి వేణుగోపాల కృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ల మధ్య వ్యవహారం తెగేదాకా పోయింది.

YSRCP Politics: ఆ విషయంలో ఆయనదే తుది నిర్ణయం.. జగన్‌కు సారీ చెప్పిన పిల్లి సుభాష్ చంద్రబోస్..
Pilli Subhash Chandra Bose, YS Jagan
S Haseena
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 26, 2023 | 7:52 AM

Share

MP Pilli Subhash Chandra Bose: కాకినాడ జిల్లా రామచంద్రాపురం రాజకీయం ఏపీలో రసకందాయంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే.. అధికార పార్టీలో వర్గపోరు ఊహించని స్థాయికి చేరుకొన్న తరువాత మంత్రి వేణుగోపాల కృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ల మధ్య వ్యవహారం తెగేదాకా పోయింది. తమకు ఇద్దరు కూడా ముఖ్యమేనని ముఖ్యమంత్రి జగన్‌ సహా వైసీపీ అధిష్టానం చెప్తున్నప్పటికీ పిల్లి సుభాష్‌ బోస్‌ మాత్రం బెట్టువీడలేదు.. అయితే, బోస్‌ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం మరోమారు దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా సీఎం జగన్.. బోస్‌ను పిలిపించి మాట్లాడారు.. చర్చల అనంతరం రామచంద్రాపురం అభ్యర్థి ఎవరో సీఎం జగన్‌ నిర్ణయిస్తారన్న పిల్లి.. ఎంపీగా తాను రాజీనామా చేస్తానన్నందుకు.. సీఎంకు క్షమాపణ చెబుతున్నానంటూ బోస్ చెప్పారు.

వైయస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు పిల్లి సుభాష్‌ బోస్‌ మంత్రిగా ఉన్నారు. వైయస్‌.జగన్‌ను ముఖ్యమంత్రిగా నియమించకపోవడంతో ఆయన మంత్రిపదవిని వదులుకుని అప్పట్లో జగన్‌ తరఫున నిలబడ్డారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఇలా నిలబడ్డవారు ముగ్గురు మాత్రమే. ఒకరు బోస్‌, ఇంకొకరు బాలినేని, మరొకరు కొండాసురేఖ. బోస్‌పట్ల సీఎం జగన్‌కున్న కృతజ్ఞతకూడా అదే. 2012 ఉప ఎన్నికల్లో బోస్‌ పోటీచేసినా.. అప్పట్లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన తోటత్రిమూర్తులు చేతిలో ఓడిపోయారు. తర్వాత 2014 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీచేసిన తోట త్రిమూర్తులు చేతిలో బోస్‌ ఓడిపోయారు. కాని అప్పటికే ఆయన వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. బీసీ సామాజిక వర్గం కావడం, కష్టకాలంలో జగన్‌ తరఫున నిలబడ్డంతో మిగిలిన వారితో పోలిస్తే బోస్‌ బాగానే పదవులు వచ్చాయి. 2019 ఎన్నికల్లో పోటీచేయకపోయినా, ఎమ్మెల్సీగా ఉన్న బోస్‌కు సీఎం మంత్రిపదవి ఇచ్చారు. ఆతర్వాత అనూహ్యంగా రాజ్యసభకు కూడా ఆయన్ని పంపారు. బోస్‌ రాజకీయ జీవితంలో ఇది పెద్దస్థానం. ఇదే సమయంలో సీఎం జగన్‌ తనను నమ్ముకున్న వేణుగోపాలకృష్ణను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంచేస్తున్నారు. వైయస్సార్‌గారు ఉన్నప్పుడు జడ్పీ ఛైర్మన్‌గా వేణు పనిచేశారు. ఆతర్వాత జగన్‌ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో కాకినాడ రూరల్‌నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2019లో రామచంద్రాపురం టిక్కెట్‌ను వైసీపీ వేణుకు ఇచ్చింది. వేణుకూడా బలమైన బీసీ సామాజిక వర్గం శెట్టిబలిజకు చెందినవారే. బోస్‌కూడా ఇదే కులానికి చెందినవారు. బోస్‌ రాజ్యసభకు వెళ్లిన తర్వాత ఆ పదవిని మంత్రి పదవిని వేణుకు ఇచ్చారు సీఎం. మంత్రివర్గం మొత్తాన్ని మార్చినా కొనసాగించిన కొద్దిమందిలో వేణు ఒకరు. తనకు సమాంతరంగా వేణు ఎదగడంతో బోస్‌ వర్గానికి రాజకీయంగా ఇబ్బందిగా తయారయ్యింది. మరోవైపు తన కుమారుడు రాజకీయ జీవితంపై కూడా ఇది ప్రభావం చూపుతుందని బోస్‌ కొన్నిరోజులుగా స్వరం మార్చుకుంటూ వస్తున్నారు.

2019 ఎన్నికల తర్వాత రామచంద్రాపురంలో మరొక పరిణామం ఏంటంటే… అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన వ్యక్తి తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. ఆయన్నికూడా సీఎం బాగానే బలపరుస్తున్నారు. వెంటనే ఎమ్మెల్సీకూడా ఇచ్చారు. అంతేకాదు పక్కనే ఉన్న మండపేట నియోజకవర్గాన్ని ఆయనకు అప్పగించారు. గడపగడపకూ సహా అనేక కార్యక్రమాల్లో త్రిమూర్తులు జోరుగా తిరుగుతున్నారు. త్రిమూర్తులను రామచంద్రాపురం నుంచి మండపేటకు పండడం, వేణుకు మళ్లీ టికెట్‌ క్లియర్‌ చేయడంలో భాగమేనని బోస్‌ వర్గం ఆదినుంచి అనుమానంతో ఉంది. టికెట్‌ వేణుకే అని స్వయంగా సీఎం చెప్పారంటూ వైసీపీ అధిష్టానం కూడా స్పష్టంచేయడంతో పిల్లబోస్‌ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

ఇవి కూడా చదవండి

బోస్‌ను చల్లార్చేందుకు సీఎం సహా వైసీపీ పెద్దలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేదు. నానాటికీ నియోజకవర్గంలో పట్టు తగ్గుడం, తాను ఢిల్లీకే పరిమితం కావడం బోస్‌కు ఇష్టంలేదు. తన కుమారుడికి రాజకీయ జీవితం ఇవ్వాలన్న తలంపులో గట్టిగా ఉన్నట్టు ఆయన అనుచరులే చెప్తున్నారు. దీంట్లో భాగంగానే అవసరమైతే రాజ్యసభను వదులు కొంటానని అన్నారు. చివరకు వేణు- బోస్‌ల మధ్య వివాదం తెగేదాకా వెళ్లింది. వేణుకు సీఎం జగన్‌ సహా, వైసీపీ అధిష్టానం టిక్కెట్‌ విషయంలో క్లారిటీ ఇచ్చేంది. ఇక తేల్చుకోవాల్సింది పిల్లి సుభాష్‌ చంద్రబోసే అని వైసీపీ పెద్దలు క్లారిటీ ఇచ్చారు. అయితే మళ్ళీ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి బోస్ మీడియా తో రాజ్యసభ వదులు కొంటానని కామెంట్ చేసిన తరువాత పిలిచి మాట్లాడారు.. పిల్లి కొడుకు సూర్య ప్రకాష్ కూడా వచ్చారు. మరి పిల్లి సుభాష్ ను ఏమని చెప్పి శాంతించారు తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం పిల్లి వెనక్కి తగ్గారు. ‘‘రామచంద్రాపురంలో ఎవరిని అభ్యర్థిగా నిలపాలో సీఎం నిర్ణయిస్తారు. తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటానని సీఎం మాటిచ్చారు.. ఎంపీగా రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీచేస్తానని గతంలో చెప్పాను.. అది బాధాకరమైన విషయం, సీఎంకు క్షమాపణలు చెబుతున్నా.. జనసేనలోకి నేను వెళ్తానన్న పుకార్లు నమ్మవద్దు’’.. అంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ ఎపిసోడ్ ను క్లోజ్ చేశారు..

మరిన్ని ఏపీ వార్తల కోసం..