తురకపాలెంలో ఆగని మరణ మృదంగం.. ఐదు నెలల్లో 30మంది మృతి.. తాజాగా మరో యువతి..!
తురకపాలెంలో మృత్యుఘోష ఆగటంలేదు. మరణాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. జ్వరంతో ఆసుపత్రికి వెళ్లినవారు శవాలుగా తిరిగి వస్తున్న పరిస్థితి. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నా మరణాలకు కారణం అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ఐదు నెలల వ్యవధిలో 30మంది ప్రాణాలు కోల్పోవడంతో తురకపాలెం ప్రజల్లో మృత్యు భయం ఆవరించుకుంది. ఎప్పుడు ఎవరి నెంబర్ వస్తుందోన్న భీతితో బ్రతుకుతున్నారు జనం.

తురకపాలెంలో మృత్యుఘోష ఆగటంలేదు. మరణాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. జ్వరంతో ఆసుపత్రికి వెళ్లినవారు శవాలుగా తిరిగి వస్తున్న పరిస్థితి. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నా మరణాలకు కారణం అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ఐదు నెలల వ్యవధిలో 30మంది ప్రాణాలు కోల్పోవడంతో తురకపాలెం ప్రజల్లో మృత్యు భయం ఆవరించుకుంది. ఎప్పుడు ఎవరి నెంబర్ వస్తుందోన్న భీతితో బ్రతుకుతున్నారు జనం. మరోవైపు, ఇప్పటివరకూ జరిగిన చావులకు అసలు కారణం ఏంటో వెల్లడించకపోవడంతో మరింత ఆందోళన నెలకొంది.
గుంటూరు జిల్లా తురకపాలెన్ని చావు భయం వీడటం లేదు. కొద్ది రోజుల పాటు ఆగిన మరణాలు తిరిగి చోటు చేసుకోవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసింది. ఇంటింటి సర్వే చేపట్టింది. మరోవైపు ఐసీఏఆర్, ఐసీఎంఆర్, ఎయిమ్స్, నేషనల్ హెల్త్ మిషన్ తదితర సంస్థలు రంగంలోకి దిగి గ్రామస్థులకు పరీక్షలు చేశాయి. అయినప్పటికీ మరణాలకు కచ్చితమైన కారణం బహిర్గతం కాలేదు. ఏడుగురుకి మెలియాయిడోసిస్ నిర్ధారణ కావటంతో వారికి జీజీహెచ్‌లో చికిత్స అందించటంతో వారంతా కోలుకున్నారు.
సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మరణాలు సంభవించకపోవడంతో గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకున్నాయని అంతా భావించారు. పారిశుద్ధ్య వసతులు మెరుగుపరిచారు. తాగునీటికి పరీక్షించి సరఫరా చేశారు. ఇక పరిస్థితి బాగుపడిందని భావిస్తున్న సమయంలో అక్టోబర్ 5వ తేదీన కృష్ణవేణి అనే 25 ఏళ్ల మహిళ జ్వరంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ మరణంతో మళ్లీ గ్రామంలో భయాందోళనలు నెలకున్నాయి. ఆమెకు డయాబెటిస్ ఉందని చికిత్స తీసుకోవాలని చెప్పిన పెడచెవిన పెట్టిందని అధికారులు అంటున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు అధికారుల మాటలను కొట్టిపారెస్తున్నారు. గ్రామంలో పరీక్షలు చేపట్టినప్పుడు ఈ విషయం చెప్పలేదంటున్నారు.
-గ్రామంలో మళ్లీ పరిస్థితి విషమించడంతో అధికారులు, కలెక్టర్ తురకపాలెంలో పర్యటించారు. ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు. అన్నిరకాలుగా చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు తెలిపారు. ఆరోగ్యశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు. మెడికల్ క్యాంప్‌ను సైతం కొనసాగిస్తున్నారు. అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇటు ప్రజలు అటు వైద్యులు, అధికారులు అప్రమత్తంగా ఉండటమే గ్రామానికి శ్రీరామరక్షఅంటున్నారు పరిశీలకులు.
మరోవైపు వాటర్ ట్యాంక్ ద్వారా పంపిణీ చేసే త్రాగునీటి సరఫరాను నిలిపివేశారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు పంపిణీ చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మెలియాయిడోసిస్ ఉందని ప్రచారం కావడంతో తమ గ్రామస్థులను చిన్నచూపు చూస్తున్నట్లు స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అసలు మరణాలకు కారణం ఏంటో వెల్లడిస్తేనే కొంతమేర ఆందోళనలు తగ్గుముఖం పడతాయని అంటున్నారు. స్థానికులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. అన్ని చర్యలు తీసుకుంటాన్నామన్నారు. క్రిష్ణ వేణి మరణ కారణం తెలుసుకునేందుకు మెడికల్ కాలేజ్ వైద్యులతో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




