Pedakakani: చావు ఇతడిని పిలుచుకుని వెళ్లినట్లు ఉంది.. ప్రమాద స్థలికి వెళ్తే…
గుంటూరు జిల్లా పెదకాకానిలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదం ఇంట్లో వ్యక్తులు సురక్షితంగా ఉండగా... ప్రమాదం చూడటానికి వెళ్లిన వ్యక్తి దుర్మరణం చెందడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...
అది గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంకట క్రిష్ణాపురం… ఉదయం పదకొండు గంటల సమయంలో ఒక్కసారిగా అమ్మిశెట్టి శ్రీనివాసరావు ఇంట్లో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి రెండు గదుల పూరిల్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. ఇంట్లోని మూడు గ్యాస్ సిలెండర్లు పేలిపోయాయి. అయితే ఈ ప్రమాదం నుండి అమ్మిశెట్టి శ్రీనివాసరావు అతని భార్య, శ్రీనివాసరావు కుమార్తె సుజాత కుటుంబం క్షేమంగా బయటపడ్డారు. కార్తీక మాసం కావడంతో ఇంట్లో దీపారాధన చేసిన కుటుంబ సభ్యులు అనంతరం అందరూ సమీపంలోని పుట్ట వద్దకు వెళ్లారు. ఈ లోపే ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో వీరంతా ప్రమాదం నుండి బయటపడ్డారు. అయితే ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో ప్రమాదాన్ని చూసేందుకు సమీపంలో ఉన్న అమ్మిశెట్టి తులసీ నాథ్, పరమేష్, వీరాంజినేయులు, మల్లిఖార్జునరావులు ఘటన స్థలానికి వచ్చారు. అప్పటికే ఇంటిలోని రెండు సిలెండర్లు పేలిపోయాయి. అయితే వీరంతా అక్కడున్న సమయంలోనే మూడో సిలిండర్ పేలి ఆ ముక్కలు ఈ నలుగురిపై పడ్డాయి. దీంతో వెంటనే స్థానికులు వీరిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పేశారు. ఆ తర్వాత ఇంటి యజమానులు అక్కడికి వచ్చారు. అయితే సిలిండర్ పేలి ఆ ఇనుపముక్కలు తలపై పడటంతో తులసీ నాథ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు.
ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుమందు కొట్టి ఇంటికి వచ్చిన తులసీ నాథ్‌కు అగ్ని ప్రమాదం సంగతి తెలిసింది. ప్రమాదానికి కూత వేటు దూరంలోనే తులసీ నాథ్ అత్తగారిల్లు ఉంది. అక్కడే భార్య పిల్లులుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న తులసీ నాథ్ హుటాహుటిన అత్తగారింటికి వెళ్లి ఇంట్లోని విద్యుత్ మెయిన్ ఆపివేసి, గ్యాస్ సిలెండర్ రెగ్యులేటర్ కూడా తొలగించాడు. ఈ తర్వాత ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లేందుకు సిద్దమయ్యాడు. అయితే భార్య అక్కడికి వెళ్లవద్దని వారించింది. అయితే దూరంగానే ఉండి చూసి వస్తానని వెళ్లిన తులసీ నాథ్ కొద్దిసేపటికే తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో మృతుడి భార్యాపిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉండగా.. ప్రమాదం చూడటానికి వెళ్లిన వ్యక్తి చనిపోవడం విధి రాత కాకపోతే మరేంటని స్థానికులు సంభాషించుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..