విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం తరువాతి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, దక్షిణమధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశముంది.
ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాల ప్రభావం మరింతగా కనిపించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం (21-10-25) నాటికి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.
ప్రఖర్ జైన్ ప్రజలకు అప్రమత్తత సూచిస్తూ, ఉరుములు, మెరుపులు పడే సమయంలో చెట్ల క్రింద నిలబడరాదని.. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకూడదని హెచ్చరించారు. అదేవిధంగా వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే తిరిగి రావాలని, సముద్రం పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున కొన్ని రోజులు వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.
అదనంగా, వర్షాల కారణంగా రహదారులు జారుడుగానుండే అవకాశం, అలాగే కొన్ని తక్కువ ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మొత్తం మీద, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ విభాగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వర్షాలు తీవ్రతరం అయితే తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందని అధికారులు తెలిపారు.





