Andhra Pradesh: మాండూస్ తుపానుపై లెటేస్ట్ అప్‌డేట్స్.. ప్రజలకు పలు సూచనలు చేసిన రాష్ట్ర విపత్తుల సంస్థ
మాండూస్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందన్న భారత వాతావరణ శాఖ సూచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ.. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తోంది. మాండూస్ తుపాను..
మాండూస్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందన్న భారత వాతావరణ శాఖ సూచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ.. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తోంది. మాండూస్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ప్రజలకు పలు సూచనలు జారీచేసింది. భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం మాండూస్ ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా బలపడిందని తెలిపింది. ప్రస్తుతానికి శ్రీలంకలోని జఫ్నాకు తూర్పు ఆగ్నేయంగా 320 కిలోమీటర్లు, కారైకాల్‌కు 350 కిలోమీటర్లు, చెన్నైకి 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ శుక్రవారం ఉదయం నుంచి క్రమంగా తుపాన్ బలహీనపడనుందని రాష్ట్ర విపత్తలు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని, తీరం దాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించారు.
మాండూస్ తుపాను ప్రభావంతో శుక్ర, శనివారాల్లో దక్షిణకోస్తాలోని ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవవచ్చని, మిగిలినచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ అధికారులు వెల్లడించారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తలు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..