Andhra Pradesh: మాండూస్ తుపాను పై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్.. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న జవహర్‌రెడ్డి
ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండూస్ తీవ్రతుఫానుగా బలపడిన నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సూచించారు. అమరావతి సచివాలయం నుంచి తుపాను ముందు జాగ్రత్త చర్యలపై..
ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండూస్ తీవ్రతుఫానుగా బలపడిన నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సూచించారు. అమరావతి సచివాలయం నుంచి తుపాను ముందు జాగ్రత్త చర్యలపై తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. మాండస్ తుపాను ఈనెల 9వ తేదీ అర్ధరాత్రికి పుదుచ్చేరి, మహా బలిపురం, శ్రీహరికోట మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఈనెల 10వ తేదీ వరకూ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లాలో ఒకటి, నెల్లూరు జిల్లాలో రెండు, తిరుపతి జిల్లాలో ఒకటి, చిత్తూరులో ఒకటి.. మొత్తం 5 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాలన్నారు. భారీ వర్షాలతో ఎక్కడైనా రహదారులకు ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తితే వెంటనే సేవలు పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు భూసేకరణపైనా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రానికి కొత్తగా మంజూరైన విజయవాడ-కడప-బెంగళూరు జాతీయ రహదారి, అనంతపురం-గుంటూరు జాతీయ రహదారి, విశాఖపట్నం-బోగాపురం-రాయపూర్ ఆరు వరసల జాతీయ రహదారి సహా ఇతర ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
కాగా.. మాండూస్ తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా సంబంధిత శాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాండూస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆయన సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..